అభ్యంతరాలను దృష్టికి తీసుకురావాలి
కరీంనగర్: ఓటరు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నగరపాలక కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ, మున్సిపాల్టీల్లో చనిపోయినవారి ఓట్లు తొలగించాలని, కుటుంబ సభ్యులందరికీ ఓట్లు ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికే అన్ని మున్సిపాల్టీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వార్డుల వారీగా ముసాయిదా ప్రకటించామన్నారు. మరణించినవారి, రెండు చోట్ల నమోదైన ఓట్లపై సమాచారం అందిస్తే తొలగిస్తామని పేర్కొన్నారు. చొప్పదండి, జమ్మికుంట, హుజురాబాద్ బల్దియాల కమిషనర్లు నాగరాజు, అయాస్, సమ్మయ్య, పార్టీల ప్రతినిధులు వై.సునీల్‌రావు, నాంపల్లి శ్రీనివాస్(బీజేపీ), చల్లా హరిశంకర్, సత్తినేని శ్రీనివాస్(బీఆర్‌ఎస్) మడుపు మోహన్ (కాంగ్రెస్), పైడిపల్లి రాజు (సీపీఐ), మిల్కూరి వాసుదేవరెడ్డి (సీపీఐఎం) తేజదీప్‌రెడ్డి (ఏఐఎఫ్‌ఎఫ్‌బీ), కందుల రాజిరెడ్డి (జనసేన) తదితరులు పాల్గొన్నారు.


