కాంగ్రెస్ కమిటీలకు 160 దరఖాస్తులు
కరీంనగర్ కార్పొరేషన్: జిల్లా కాంగ్రెస్, కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీలో చోటుకోసం ఆశావహుల నుంచి పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. ఇటీవల డీసీసీ అధ్యక్షుడిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా వైద్యుల అంజన్ కుమార్‌ను నియమించిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా, కార్పొరేషన్ కార్యవర్గ నియామకంపై దృష్టి సారించిన అధిష్టానం, ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టింది. దీనికోసం పరిశీలకులను నియమించింది. మంగళవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో పరిశీలకులు శ్రీనివాస్, గౌస్ వివిధ పదవుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ కమిటీలో పదవులకోసం పెద్ద సంఖ్యలో 120 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ పదవులకోసం 40 మంది దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని ఈ సందర్భంగా సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ తాజ్, శ్రావణ్ నాయక్, సిరాజుద్దీన్, ఎస్‌ఏ మోసిన్, అహ్మద్‌అలీ, అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.


