గంజాయి విక్రేతల అరెస్టు
కరీంనగర్‌రూరల్: బొమ్మకల్ బైపాస్‌రోడ్డులో గంజాయి విక్రయించేందుకు వచ్చిన ముగ్గురు యువకులను మంగళవారం పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో భాగంగా అరెస్టు చేయగా వారిలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులున్నారని కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. బొమ్మకల్ బైపాస్‌రోడ్డులో ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు ద్విచక్రవాహనాలపై వస్తున్న ముగ్గురు యువకులు పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారు. రామగుండంకు చెందిన సాయి వర్షిత్ వాహనాన్ని తనిఖీ చేయగా గంజాయి లభించింది. ముగ్గురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టగా ఏపీలోని అరకు వెళ్లి డిసెంబర్ 31 కోసం గంజాయి కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు సాయివర్షిత్ తెలిపాడు. కరీంనగర్‌లో ఎక్కువ ధరకు గంజాయి విక్రయించేందుకు తన స్నేహితులైన ఇంజినీరింగ్ చేస్తున్న సాయి కార్తీక్, సాయితేజల సాయంతో బైపాస్ రోడ్డులో లారీ డ్రైవర్ల కోసం వచ్చినట్లు అంగీకరించాడు. ముగ్గురి వద్ద నుంచి రెండు బైకులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. గంజాయి విక్రయించిన, తాగిన కఠిన శిక్షలుంటాయని, రౌడీషీట్స్ ఓపెన్ చేస్తామని తెలిపారు. యువకులు, విద్యార్థులు గంజాయికి అలవాటు పడి ఉజ్వల భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచించారు.


