లా ఇంటర్నల్స్ బైకాట్
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ లా విభాగంలో అటెండెన్స్ సాకుతో విద్యార్థులను పరీక్షలకు దూరం చేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. నిరసనగా లా ఇంటర్నల్స్ బైకాట్ చేశారు. పలువురు విద్యార్థులు తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లా విద్యార్థుల ప్రతినిధులు మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలన్నారు. అటెండెన్స్ నిబంధనల పేరుతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేయడం సరికాదన్నారు. విద్యార్థుల ప్రాణాల మీదకు వచ్చేలా నిబంధనలు ఉండకూడదని కోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ఎస్‌యూ అధికారుల ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా లా విద్యార్థులందరూ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కేవలం అటెండెన్స్ ఉన్నవారికే పరీక్షలు నిర్వహిస్తామనే మొండి వైఖరి వీడి, అందరినీ సమానంగా చూడాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం వృథా కాకుండా యూనివర్సిటీ యాజమాన్యం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.


