పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు
● అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే
కరీంనగర్‌టౌన్: బాల కార్మికుల నిర్మూలనకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఈనెల 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని వివిధ శాఖల సమన్వయంతో పక్కగా నిర్వహించాలని ఆదేశించారు. పరిశ్రమలు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు, గోదాములు, ఇటుకబట్టీలు, మెకానిక్ షాపులు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు, సహాయం అవసరమైన పిల్లలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 1098 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్ ధనలక్ష్మి, ఇన్‌చార్జి జిల్లా సంక్షేమ అధికారి సుగుణ, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సతీశ్, డీసీపీవో పర్వీన్, చైల్డ్ హెల్ప్‌లైన్ జిల్లా కో ఆర్డినేటర్ సంపత్‌యాదవ్, లేబర్ కమిషనర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్, క్వాలిటీ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


