గంజాయి నిందితులే ఎక్కువ!
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ జిల్లా జైలులో గంజాయి కేసుల నిందితులు ఎక్కువగా ఉంటున్నారు. జిల్లాలో గంజాయి కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గతేడాది మొత్తం 270 మంది గంజాయి సంబంధిత కేసుల్లో అరెస్టు అయి జైలుకెళ్లగా.. ప్రస్తుతం 18 మంది నిందితులు కరీంనగర్ జైలులో రిమాండ్ ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు. పోలీసు గణాంకాలు పరిశీలిస్తే.. ఈ ఏడాది కేవలం కరీంనగర్ జిల్లాలో 25 మంది గంజాయి కేసులో నిందితులను అరెస్టు చేయగా.. రూ.6.44లక్షలు విలువగల 29.042 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇతర మత్తు పదార్థాల కేసులతో పోల్చితే గంజాయి కేసులు సంఖ్యాపరంగా ముందున్నాయి. గంజాయి కేసుల్లో దాదాపు వంద శాతం యువతే నిందితులుగా ఉన్నారు. నిరుద్యోగం, ఆసక్తి, స్నేహితుల ప్రలోభాలు తదితర కారణాల వల్ల గంజాయి వాడకంలో యువకులు పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో నిందితుల్లో మార్పు తీసుకురావడానికి ప్రత్యేక కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నారు. మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, చట్టపరమైన పరిణామాలు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం వంటి అంశాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. క్రమశిక్షణతో జీవితం గడపడం, ఉద్యోగావకాశాలపై దృష్టి సారించడం వంటి అంశాలను కూడా కౌన్సెలింగ్‌లో భాగం చేస్తున్నారు. పోలీసు అధికారులు ప్రజల్లో అవగాహన పెంచేందుకు పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నారు. గంజాయి వాడకం కేవలం చట్టవిరుద్ధమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ జీవనంపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఒక అధికారి పేర్కొన్నారు. కొన్నేళ్లుగా తెలంగాణ వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా, వినియోగం పెరగడంతో రాష్ట్ర పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జైలు గణాంకాలు మత్తు పదార్థాల వ్యసనంపై ఆందోళన కలిగిస్తున్నాయి.
యువతే టార్గెట్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యువకులు, విద్యార్థుల్లో గంజాయి అలవాటు పెరుగుతోందని, పలు పట్టణాల్లో గంజాయి విక్రయం, వినియోగంపై పోలీసు దాడులు కొనసాగుతున్నాయి. యువతే టార్గెట్‌గా మారుతున్న మత్తు ముఠాలు జైలు అధికారుల ప్రకారం గంజాయి కేసుల్లో ఇరుక్కునే వారిలో ఎక్కువ మంది 18–30 ఏళ్ల మధ్య వయస్సున్న యువకులే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో ముఠాలు యువతను వ్యసనానికి గురి చేసి.. చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో గంజాయిని సరఫరా చేస్తున్నాయనే అంశం ఇటీవల పోలీసు దర్యాప్తుల్లో వెలుగు చూసింది. అమ్మకాలకు, కొనుగోళ్లకు ప్రత్యేకంగా ఒక ఇంగ్లిష్ అక్షరం వై.. దానిచుట్టూ వృత్తాకారం గుర్తు టాటు వేసుకుంటున్నట్లు.. సదరు టాటు ఉన్నవాళ్లకు గంజాయి అమ్మకందారులు విక్రయాలు జరుపుతున్నట్లు జైలు, పోలీసు అధికారులు పరిశీలనలో తేలింది.
కౌన్సెలింగ్.. డీ–అడిక్షన్
కరీంనగర్ జిల్లా జైలులో వారానికోకసారి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నుంచి సైకాలజిస్ట్ వస్తూ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. గంజాయి కేసుల్లో జైలుకొచ్చిన నిందితులకు జైలు లోపలే ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి. మత్తు అలవాటును తగ్గించేందుకు మానసిక నిపుణులు, సామాజిక కార్యకర్తల సహకారంతో సెషన్లు నిర్వహిస్తున్నారు. తెలంగాణ జైలు శాఖ రాష్ట్రవ్యాప్తంగా సెంట్రల్ జైళ్లలో డీ–అడిక్షన్ సెంటర్లు స్థాపించేందుకు చర్యలు తీసుకుంటుండంగా.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్లలో కేంద్రాలు స్థాపించనున్నారు. గంజాయి, ఇతర మత్తు కేసుల్లో ఇరుక్కున్న ఖైదీలకు చికిత్స, పునరావాసం కల్పించే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. శిక్షతోపాటు మార్పు కూడా ముఖ్యమని గంజాయి కేసుల్లో శిక్షలు పడిన వారు తిరిగి అదే మార్గంలో నడవకుండా ఉండాలంటే జైల్లోనే కౌన్సిలింగ్, వృత్తి సాధన, పునరావాసం తప్పనిసరని రాష్ట్ర జైలు శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
పెద్దఎత్తున గుప్పుమంటున్న మత్తు
ఏడాదిలో 270 మంది కరీంనగర్ జైలుకు..
ప్రస్తుతం జైలులో 18 మంది
నిందితుల్లో వంద శాతం యువతే..
గంజాయి దందా చేసేవారికి స్పెషల్ సింబల్ టాటులు


