చర్యలుంటాయా.. ఉండవా ?
కరీంనగర్ అర్బన్: టెంపరరీ రిజిస్ట్రేషన్(టీఆర్) దందాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందా.. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోనుందనేది త్వరలోనే తేలనుంది. టీఆర్‌లను దుర్వినియోగం చేసిన అధికారులతోపాటు జిన్నింగ్ మిల్లులు, సీసీఐ తోడుదొంగల్లా వ్యవహరించింది. కూటమి కట్టి ఇష్టారీతిగా రూ.కోట్లు గడించారని సమాచారం. ఈనేపథ్యంలో కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగాయని కొన్ని నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా పదికి పైగా మార్కెట్ కార్యదర్శులతోపాటు డీఎంవోలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో విజిలెన్స విచారణ నివేదిక ప్రభుత్వానికి సమర్పించగా చర్యలుంటాయా.. ఉండవా.. అనేది హాట్‌టాపిక్‌గా మారింది.
మీనమేషాలు.. కొనసాగిన విచారణ
జిల్లాలో 200–250 టీఆర్ పుస్తకాలను మార్కెట్ అధికారులు, వ్యవసాయ అధికారులకు ఇచ్చారు. ఒకటి అసలు ధ్రువీకరణపత్రం రైతుకు జారీ చేయగా, మరొకటి నకలు తీసుకుంటారు. వీటిని మార్కెట్ అధికారులకు ఇవ్వాలి. జిల్లాలో 7వేల టీఆర్లు జారీ అయినట్లు తెలుస్తోంది. అసలు అవినీతి అంతా ఇక్కడే జరిగింది. జిల్లాలోని ప్రధాన మార్కెట్లతోపాటు గంగాధర, చొప్పదండి, తదితర మార్కెట్లలో టీఆర్‌లు జారీ కాగా దుర్వినియోగమయ్యాయన్న కోణంలో దర్యాప్తు చేశారు. 2024–25 పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరగగా టీఆర్ (తాత్కాలిక రిజిస్ట్రేషన్)ల జారీలో అవకతవకల వివరాలు సేకరణలో విజిలెన్స్ సఫలీకృతమైందని తెలుస్తోంది. సీసీఐ కొనుగోళ్లు నిలిపివేయడంతో సంబంధిత వెబ్‌సైట్ సైతం మూతపడింది. ఒకవేళ అవకతవకలు జరిగితే ఎక్కడో చెప్పాలని స్పష్టం చేశారు. వీరు పంపిన నివేదికతోపాటు ఇది వరకే విజిలెన్స్ అధికారులు విచారణ అంశాలను బేరీజు వేసి, అక్రమాలను తేలిన చోట, తప్పులతడకగా వివరాలు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారని తెలుస్తోంది.
2004 కుంభకోణం అటకెక్కినట్టేనా?
ఉమ్మడి జిల్లా పరిధిలో 2004 నుంచి 2007 మధ్య కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోలు చేసింది. రైతులు మార్కెట్‌కు వెళ్లినప్పుడు ధరలు పెట్టకుండా.. నానా రకాల కొర్రీలతో కొనుగోళ్లు చేయని సీసీఐ ఏటా చివరిలో రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు ప్రకటనలు చేసింది. దీనిపై రైతులు, రైతు సంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు చేశాయి. సీసీఐ కేంద్రాల నిర్వాహకులు, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు ఒక్కటై దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించాయి. రైతుల ఆందోళనకు దిగివచ్చిన ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వం విజిలెన్స్, సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. సీసీఐ, జిన్నింగ్ మిల్లుల యజమానులకు అనుకూలంగా విజిలెన్స్, సీబీసీఐడీ అధికారులు వ్యవహరిస్తున్నారని గ్రహించిన కురుక్షేత్ర అనే స్వచ్ఛంద సంస్థ, రైతు సాధికారక సంస్థ సీబీఐతో విచారణ చేయించాలని హైకోర్టును ఆశ్రయించాయి. ఫలితంగా సీబీఐ ఆధికారులు రంగంలోకి దిగారు. అయితే దశాబ్దాలు గడిచినా విచారణ పూర్తికాక పోగా, అక్రమాల్లో భాగస్వాములైనవారు ఉన్నత హోదాల్లో ఉండటం గమనార్హం.
పత్తి కొనుగోళ్ల అవకతవకలపై ముగిసిన విచారణ
ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక
అక్రమార్కుల్లో గుబులు


