‘ఇందిరమ్మ’బిల్లుల చెల్లింపులో మార్పు
కరీంనగర్‌రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం బిల్లుల చెల్లింపు విధానంలో కొన్ని మార్పులు చేసింది. గతంలో ఇళ్ల నిర్మాణ ప్రగతి ఆధారంగా దశలవారీగా రూ.5లక్షలను లబ్ధిదారులకు చెల్లించారు. ప్రస్తుతం గోడల నిర్మాణం పూర్తి చేసినట్లయితే రూ.1.40లక్షలు, మరో రూ.60వేలను ఉపాధిహామీ పనులకు భాగస్వామ్యం కల్పించారు. నగరం, పట్టణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన కింద ఈ బిల్లులను చెల్లిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీఒక్క లబ్ధిదారు పనులు చేసుకునేలా అవకాశం కల్పించింది. ప్రభుత్వం విడతల వారీగా లబ్ధిదారులకు మొత్తం రూ.4.40లక్షలను చెల్లించనుంది. కరీంనగర్ జిల్లాలో మొత్తం 8,239 ఇళ్లు మంజూరు కాగా 871 రద్దు చేసుకున్నారు. మిగతా ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు ప్రారంభించారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఇళంల నిర్మాణాలు ఉఏన్నాయి.
ఉపాధిహామీలో రూ.60వేల చెల్లింపు..
గ్రామీణ ప్రాంతాల్లో 90 పని దినాలకు రోజుకు రూ.300 చొప్పున రూ.27వేలు లబ్ధిదారుకు ఉపాధిహామీ ద్వారా చెల్లిస్తారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు, మిగిలిన రూ.21వేలను పీఎం గ్రామీణ ఆవాస్ యోజన కింద మంజూరు చేస్తారు. కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు మిగతా పట్టణ ప్రాంతాల్లో రూ.60వేలను పీఎం ఆవాస్ యోజన ద్వారా చెల్లిస్తారు. బిల్లుల చెల్లింపు విధానంలో లబ్ధిదారులు ఆందోళనకు గురికావద్దని గృహనిర్మాణ సంస్ధ అధికారులు పేర్కొంటున్నారు.
ఉపాధిహామీలో రూ.60వేలు చెల్లించేలా నిర్ణయం


