ప్రీ ప్రైమరీ పాఠశాలలకు మహర్దశ
కరీంనగర్‌టౌన్: ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలకు మహర్దశ పట్టనున్నది. జిల్లాలో 25 ప్రీప్రైమరీ పాఠశాల ఇన్స్‌స్ట్రక్టర్లుకు గతనెల 25 నుంచి 29 వరకు సప్తగిరికాలనీ ప్రభుత్వం పాఠశాలలో శిక్షణా శిబిరం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య బోధిస్తున్న ఈ పాఠశాలలకు బోధనాభ్యాసన సామగ్రిని సమగ్ర శిక్ష అధికారులు సమకూరుస్తున్నారు. ఆటపాటలతో చిన్నారులకు బోధన చేసేందుకు ఈ సామగ్రి ఉపయోగపడనున్నది. వీటితో పాటు తరగతి గదులకు రంగులు, బాలలకు ఏకరూప దుస్తులు అందించనున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అధునాతన వసతులతో చిన్నారులే కాకుండా వారి తల్లిదండ్రులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏడాది మొదటగా జిల్లా వ్యాప్తంగా 25 ప్రీప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేశారు. వీటికి ఒక ఇన్‌స్ట్రక్టర్ చిన్నారులను చూసుకునేందుకు ఆయాను విద్యాశాఖ నియమించింది. దాదాపు 250 మందికిపైగా బాలలు చేరగా యూకేజీ తరగతులు బోధిస్తున్నారు. అయితే సాధారణ రీతిలో బోధన చేస్తుండటంతో చిన్నారులు ఆకర్షితులు కావడం లేదని తెలుస్తోంది. కిడ్స్ కేర్ పాఠశాలలను తలపించేలా ఈ పాఠశాలల్లో అధునాతన వసతులు, ఆటపాటలతో కూడిన బోధన పద్ధతులతో తీర్చిదిద్దేందుకు అధికారులు దృష్టిసారించారు.
బోధన సామగ్రికి నిధులు
జిల్లాలోని ఒక్కో ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలకు రూ.1.70 లక్షల నిధులు కేటాయించి వీటిని తీర్చిదిద్దుతున్నారు. సామగ్రి, బోధనాభ్యసన సామగ్రి అందించనున్నారు. ఇప్పటికే జిల్లాకు చేరడంతో ఎంఈవోల ద్వారా పాఠశాలలకు పంపిణీ చేశారు. పాఠశాల తరగతి గదులను అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు రూ. 50వేలతో రంగులు వేయిస్తున్నారు. రూ.20వేలతో బాలలకు దుస్తులు, స్టేషనరీ సమకూరుస్తున్నారు. ఆట పాటలతో అభ్యసనా సాగించేందుకు పలు రకాల వస్తువులు, ఆట బొమ్మలు, రంగు రంగుల ఆకారాలు వంటివి అందించనుండటంతో చిన్నారులు చదువుపై ఆసక్తి చూపిస్తారని, ఈ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
ప్రీప్రైమరీ స్కూళ్లకు కూడా..
ప్రీ ప్రైమరీ పాఠశాలల్లోని చిన్నారులకు ప్రతీరోజు పాలు పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రీప్రైమరీ పాఠశాలను బలోపేతం చేసే దిశగా చిన్నారులకు పాలు తదితర ఆహార వస్తువులు అందజేయాలనే ఇటీవల మంత్రి సీతక్క తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని 3–6 ఏళ్ల మధ్య వయస్సు గల చిన్నారులకు ఏడాదిలో 200 రోజుల పాటు రోజు 100 మి.లీ. పాలు పంపిణీ చేసేందుకు సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రుతి ఓజా ఇటీవల ఆదేశాలు జారీచేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు లీటర్ విజయ డెయిరీ డబుల్ టోన్డ్ యూహెచ్ టీ టెట్రా ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. ప్రీప్రైమరీ స్కూళ్లను బలోపేతం చేసే దిశగా అధికార యాంత్రాంగం సన్నద్ధమవుతోంది.


