ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్
● తొలి విడత ఎన్నికలు ముగిసినా వర్తింపు ● జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి
కరీంనగర్ అర్బన్: ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. ఈ నెల 11తో తొలి విడత ఎన్నికలు పూర్తవుతున్న ప్రాంతాల్లోనూ మూడో విడత ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమలులో ఉంటుందని వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకూడదని పేర్కొన్నారు. మూడోదశ ఎన్నికలు పూర్తయిన తరువాతే కోడ్ ఎత్తివేస్తామని వివరించారు. మొదటి, రెండో దశలో ఎన్నికై న అభ్యర్థులు, ఇతరులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించవద్దని, ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలలో సైతం ఎన్నికల కోడ్ ఉంటుందని వివరించారు. కోడ్ నిబంధనలను విస్మరిస్తే చట్ట ప్రకారం తీవ్రమైన చర్యలుంటాయని పేర్కొన్నారు.
12న భద్రాచలానికి లగ్జరీ బస్సు
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ ప్రత్యేక టూర్‌లో భాగంగా కరీంనగర్ 2డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 12 శుక్రవారం రాత్రి 8 గంటలకు కరీంనగర్ బస్టాండ్ నుంచి బయలుదేరుతుందని డిపో మేనేజర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. 13న పాపికొండలు బోటింగ్, అదేరోజు రాత్రి భద్రాచలం చేరుకుంటుందని, 14న భద్రాచలం, పర్ణశాల దర్శనం అనంతరం అదేరోజు రాత్రి కరీంనగర్ చేరుకుంటుందని డిపో మేనేజర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. పెద్దలకు రూ.1800, పిల్లలకు 1300 టికెట్ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9398658062, 8978383084, 9182610182 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
సిటీలో పవర్‌కట్
కొత్తపల్లి: కరీంనగర్‌లో విద్యుత్ పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెడ్డి ఫంక్షన్‌హాల్, తేజ స్కూల్, ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల ప్రాంతాలు, అదేవిధంగా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11కేవీ శ్రీవేంకటేశ్వర ఫీడర్ పరిధిలోని కెమిస్ట్‌భవన్, శివ థియేటర్, కోర్టు వెనుకభాగం, జ్యోతినగర్, వేంకటేశ్వర ఆలయం, ఎక్స్‌ఫ్లోరికా స్కూల్ ప్రాంతాలు, ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు 11కేవీ గౌతమినగర్ ఫీడర్ పరిధిలోని కట్టరాంపూర్ మెయిన్‌రోడ్, తిరుమల్‌నగర్, రెడ్డికాలనీ, శ్రేయం అపార్ట్‌మెంట్, మౌళిచంద్ర అపార్ట్‌మెంట్, మైనార్టీ స్కూల్, గిద్దె పెరుమాండ్ల ఆలయం, మహాలక్ష్మీనగర్, ప్రొ.జయశంకర్ కాలనీ, శ్రీనివాస్‌నగర్‌కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్‌గౌడ్, ఎం.లావణ్య తెలిపారు.
తీగలగుట్టపల్లిలో..
విద్యుత్ 132 లైన్ పనులు కొనసాగుతున్నందున ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెడ్డి ఫంక్షన్‌హాల్, సరస్వతీనగర్, వడ్ల కాలనీ, చంద్రాపూర్‌కాలనీ, రెవెన్యూ కాలనీ, హనుమాన్‌నగర్, అమ్మగుడి, తీగులగుట్టపల్లి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్‌రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.
నిజాయితీపరులనే ఎన్నుకోవాలి
గన్నేరువరం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మందు..విందుకు ఓట్లను అమ్ముకోవద్దని, గ్రామాభివృద్ధికి పాటు పడే నిజాయితీ గల అభ్యర్థులను ఎన్నుకోవాలని రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు బామండ్ల రవీందర్, కార్యదర్శి మాశం అంజనేయులు అన్నారు. మండలంలోని మాదాపూర్, గునుకుల కొండాపూర్ గ్రామాల్లో శనివారం ఎన్నికల్లో ఓటుహక్కు, అభివృద్ధి వంటి అంశాలపై ఓటర్లకు వివరించారు. ఓటు వజ్రాయుధమని, నోట్లకు ఓట్లు అమ్ముకునే సంస్కృతికి స్వప్తి పలకాలని కోరారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడే వ్యక్తిని సర్పంచ్ ఎన్నుకుంటే అన్ని రంగాల్లో గ్రామాలు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్


