స్థానికం.. పోస్టల్‌కు దూరం
ఈసారైనా ఓటింగ్ పెరిగేనా?
ఓటేసేందుకు ఉద్యోగులు నిరాసక్తత
లెక్కింపులో బయటపడుతామన్న భయమే కారణం
ఈనెల 9 వరకు ఓటింగ్‌కు అవకాశం
కరీంనగర్ అర్బన్: ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులను స్థానిక సంస్థల ఎన్నికలు ఓటుకు దూరం చేస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో సదరు ఉద్యోగి ఎవరికి ఓటు వేశారనేది తేలిగ్గా బహిర్గతమయ్యే అవకాశాలుండటమే అందుకు ప్రధాన కారణం. దీంతో పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవడంపై చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు విముఖత చూపుతున్నారు. సాధారణ ఎన్నికల్లో 70 నుంచి 85 శాతం మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కు వినియోగించుకుంటుండగా స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి 10 శాతం దాటకపోవడం గమనార్హం.
పోస్టల్ బ్యాలెట్‌కు ఏర్పాట్లు
కాగా.. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక బాక్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ నెల 9 వరకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.
ఓటేసేందుకు ఉద్యోగుల విముఖం
కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి, నియోజకవర్గాల్లో 6 వేల మందికిపైగా ఉద్యోగులున్నారు. వీరిలో నాలుగువేల మంది వరకు ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారని సమాచారం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రంపై టిక్‌చేసి డివిజన్ కేంద్రాలకు పంపిస్తారు. కానీ...స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి పోస్టల్ బ్యాలెట్ పేపర్‌పై వారికి నచ్చిన సర్పంచ్, వార్డు అభ్యర్థుల గుర్తులపై టిక్‌చేసి కవర్‌లో మండల పరిషత్ కార్యాలయాల్లో అప్పగిస్తారు. అధికారులు అక్కడి నుంచి సదరు ఉద్యోగుల సొంత గ్రామాలు, వార్డుల స్థానాల లెక్కింపు కేంద్రాలకు పంపిస్తారు. ఇక్కడే పెద్ద సమస్య. సాధారణంగా గ్రామ స్థాయిలో ఏ వార్డులో ఎంత మంది ఉద్యోగం చేస్తున్నారో స్థానికులకు తెలుసు. ఒక వార్డులో ఒకరు మరో వార్డులో ఒకరిద్దరు ఇలా వేళ్ల మీద లెక్కించే సంఖ్యలోనే ప్రభుత్వ ఉద్యోగులుంటారు. ఓట్లు లెక్కింపు సమయంలో మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అభ్యర్థులు, కౌంటింగ్ కేంద్రాల్లోని ఏజెంట్లకు ప్రతీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను చూపుతారు. పేరు, వివరాలు లేనప్పటికి ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ఆ ఉద్యోగి ఓటు ఏ అభ్యర్థికి వెళ్లిందో స్పష్టంగా తేటతెల్లమవుతోందని ఉద్యోగులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు సంఘాలు ఎప్పటి నుంచో ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ వెసులుబాటు లభించడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. అన్ని ఓట్లలో కలిపి లెక్కిస్తేనే సమస్యకు పరిష్కారమని చెబుతున్నారు.


