
ఆ దొంగ టార్గెట్ వృద్ధులే!
ధర్మారం(ధర్మపురి): ఒంటరిగా కనిపించిన వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తూ మాయమాటలు చెప్పి ఆభరణాలు అపహరిస్తున్న అంతర్‌జిల్లా దొంగను ఎస్సై ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓల్లెపు కృష్ణను ధర్మారంలోని గణేశ్‌నగర్ మెడికల్ ఏజెన్సీ వద్ద అరెస్ట్ అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడిన కృష్ణ ఈనెల 10న కూరగాయల కోసం ధర్మారంలోని అంబేడ్కర్ చౌరస్తా వైపు వస్తున్న బుధారపు శంకరమ్మను కలిశాడు. పింఛన్ డబ్బులు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. సమీపంలోని గాయత్రి బ్యాంకు ఎదురుగా ఉన్న గల్లీలోకి తీసుకెళ్లి మెడలోని రెండు తులాల బంగారు పుస్తెలతాడును ఎత్తుకెళ్లాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ధర్మారంలో నిదితుడు సంచరిస్తున్నాడనే సమాచారంతో వలపన్ని పట్టుకున్నారు. గతజూలై 31న ధర్మపురిలోని నందిచౌరస్తా వద్ద వృద్ధురాలికి తను పంచాయతీ కార్యదర్శిగా పరిచయం చేసుకుని పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి ఆమె మెడలోని రెండు తులాల చైన్ దొంగలించాడు. ఈమేరకు కృష్ణ నుంచి రెండు తులాల బంగారు గొలుసు, మరోకేసులో 30వేల విలువైన సొ త్తు స్వాధీనం చేసుకున్నారు.కేసును ఛేదించిన ఎ స్సై ప్రవీణ్‌కుమార్‌ను ఏసీపీకృష్ణ అభినందించారు.
నిందితుడిపై 96 కేసులు..
నిందితుడు ఓల్లెపు కృష్ణపై కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల, ముస్తాబాద్, బెజ్జంకి, తంగళ్లపల్లి, ఆర్మూర్, కీసర, హసన్‌పర్తి, సుబేదారి, పరకాల, కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో సుమారు 96 కేసులు నమోదైనట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన కృష్ణ కరీంనగర్‌లోని మారుతీనగర్‌లో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. తన అవసరాల కోసం మళ్లీ దొంగతనాలకు పాల్పడతున్నాడు.
ఒంటరిగా కనిపిస్తే చాలు మాయమాటలు
ఆ తర్వాత నిలవుదోపిడీ చేస్తూ ఉడాయింపు
అంతర్‌జిల్లా దొంగ అరెస్టు
వారం రోజుల్లోనే కేసును
ఛేదించిన పోలీసులు