
కదిలిన జవాన్ల పీఠాలు
కరీంనగర్ కార్పొరేషన్: ఎట్టకేలకు నగరంలోని పారిశుధ్య జవాన్ల పీఠాలు కాస్త కదిలాయి. నగరంలోని 66 డివిజన్లకు సంబంధించిన 61 మంది జవాన్లను అంతర్గతంగా బదిలీ చేస్తూ నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా డివిజన్లలో ఏళ్లుగా పాతుకుపోయిన జవాన్లు చెత్త పేరుతో దందా సాగిస్తుండడం, రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న తీరుపై గతంలో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడం తెలిసిందే. కొంతమంది నేతల అండదండలతో జవాన్ల అక్రమాలకు పాల్పడుతుండడం, ఒకే డివిజన్‌లో తిష్ట వేయడంపై కథనాల్లో పేర్కొనడంతో కమిషనర్ స్పందించారు. 10 మంది ప్రభుత్వ, 51 మంది ఔట్‌సోర్సింగ్ జవాన్లను బదిలీ చేశారు. కొద్దిమందికి రెండు డివిజన్‌ల బాధ్యతలు అప్పగించారు. ముగ్గురికి నైట్‌స్వీపింగ్, ఒకరికి కంట్రోల్ రూం శానిటేషన్ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
పక్క డివిజన్లే
సుదీర్ఘకాలం తరువాత శానిటేషన్ జవాన్లకు స్థానచలనం కలిగినా, పైరవీలు పనిచేశాయనే ప్రచారం జరుగుతోంది. ‘సాక్షి’ గతంలోనే చెప్పినట్లు పక్క డివిజన్లకే బదిలీ అయి, మళ్లీ అదే ప్రాంతంలో తమ ఆధిపత్యం చలాయించేందుకు జవాన్లు సిద్ధం అవుతున్నారు. సోమవారం జరిగిన బదిలీలను చూస్తే కొంతమందికి పక్క డివిజన్‌కే బదిలీ చేశారు. అంటే కేవలం బదిలీ అయినట్లుగానే ఉంటుంది తప్ప, అదే ప్రాంతంలో మళ్లీ దందాను యథేచ్ఛగా సాగించే అవకాశం ఏర్పడింది. పూర్తిస్థాయిలో పారిశుధ్య జవాన్ల ప్రక్షాళన జరగాలంటే, పక్క డివిజన్ల బదిలీలను కూడా మార్చాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

కదిలిన జవాన్ల పీఠాలు