కుంగుబాటు.. లొంగుబాటు! | - | Sakshi
Sakshi News home page

కుంగుబాటు.. లొంగుబాటు!

Oct 16 2025 5:03 AM | Updated on Oct 16 2025 5:03 AM

కుంగు

కుంగుబాటు.. లొంగుబాటు!

నాడు జనశక్తి.. నేడు మావోయిస్టులు

2002లోనే 46 మంది సాయుధ జనశక్తి నక్సలైట్ల సరెండర్‌

అప్పటి సీఎంకు ఆయుధాలు అప్పగింత

నేడు మహారాష్ట్రలో పునరావృతం.. 61 మంది అస్త్రసన్యాసం

సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రెండున్నర దశాబ్దాల కిందట సీపీఐ(ఎంఎల్‌) మావోయిస్టు, జనశక్తి నక్సలైట్ల ఉద్యమాలు బలంగా ఉండేవి. కరీంనగర్‌ జిల్లాను తూర్పు, పశ్చిమ డివిజన్లుగా విభజించి నక్సలైట్ల కార్యకలాపాలు సాగేవి. ఇప్పటి పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాలు తూర్పు డివిజన్‌ పరిధిలో ఉండగా.. రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాలు పశ్చిమ డివిజన్‌ పరిధిలో ఉన్నాయి. తూర్పు డివి జన్‌లో మావోయిస్టు(అప్పటి పీపుల్స్‌వార్‌)లకు పట్టుండగా.. పశ్చిమ డివిజన్‌లో మావోయిస్టులతోపాటు జనశక్తి నక్సలైట్లు సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు. తాజాగా మావోయిస్టు పార్టీకి చెందిన పోలిట్‌బ్యూరో సభ్యుడు, మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ అభయ్‌ అలియాస్‌ సోను అలియాస్‌ భూపతితో సహా 60 మంది సాయుధ నక్సలైట్లు, మహారాష్ట్ర సీఎం దేవేందర్‌ ఫడ్నవీస్‌ ఎదుట బుధవారం లొంగిపోయారు. మావోయి స్టు ఉద్యమ చరిత్రలో కేంద్ర కమిటీ సభ్యుడి స్థా యి నాయకుడితోపాటు ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోవడం ఓ మైలురాయి.

23 ఏళ్ల కిందట జనశక్తి

తాజా పరిణామాల నేపథ్యంలో 23 ఏళ్ల కిందటే సీపీఐ(ఎంఎల్‌) జనశక్తి సాయుధ నక్సలైట్లు 46 మంది లొంగుబాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పటి జనశక్తి పార్టీ కరీంనగర్‌ జిల్లా కమిటీ కార్యదర్శి రణధీర్‌ అలియాస్‌ సుంకెట సాయిలు ఆధ్వర్యంలో జనశక్తి జిల్లా కమిటీ సభ్యులు ముకేశ్‌, జగన్‌, గుట్టన్న, మహేశ్‌, రవీందర్‌రెడ్డిలతోపాటు మొత్తం 46 మంది సాయుధులు లొంగిపోయారు. ఇప్పుడు గడ్చిరోలీ జిల్లా తరహాలోనే అప్పట్లో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట–రుద్రంగి మధ్య అటవీ ప్రాంతంలో ప్రైవేటు సర్వీసు బస్‌లో 46 మంది సాయుధ నక్సలైట్లు హైదరాబాద్‌ వెళ్లారు. మధ్యలో ఆ బస్‌లో పోలీసులు ఎక్కారు. రెండు రోజులపాటు హైదరాబాద్‌ శివారులోని ఓ రిసార్ట్‌లో బసచేసిన నక్సలైట్లు అప్పటి సీఎం చంద్రబాబు సమక్షంలో లొంగిపోయారు. అప్పటి డీజీపీ పేర్వారం రాములు, అప్పటి ఎస్పీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌(ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నాయకుడు), ఓఎస్‌డీ మధుసూదన్‌రెడ్డిలు జనశక్తి నక్సలైట్ల లొంగుబాటులో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే జనశక్తి పార్టీని వేములవాడ మూలవాగులో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఆ టైంలో మిగిలి ఉన్న కొద్దిమంది యాక్టివ్‌ సభ్యులు కూడా లొంగిపోయారు. తర్వాతి క్రమంలో ఆ పార్టీ కనుమరుగైంది.

లొంగుబాటుకు ముందు..

జనశక్తి నక్సలైట్ల లొంగుబాటుకు ముందు 2001 అక్టోబర్‌ 26న బోయినపల్లి మండలం కోరెంలో సొంతూరిలో దసరా వేడుకలకు వచ్చిన అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు బావమరిది క్లాస్‌–1 కాంట్రాక్టర్‌ మార్తండరావును జనశక్తినేత రణధీర్‌ కిడ్నాప్‌ చేశారు. రాయభేరాల తరువాత వారం రోజులకు విడుదల చేశారు. ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు జనశక్తిపై దృష్టిసారించారు. ఈ క్రమంలో రణధీర్‌తో అప్పటి జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌, ఓఎస్‌డీ మధుసూదన్‌రెడ్డి మరో ఇద్దరు పోలీసు అధికారులు నేరుగా మేడిపల్లి మండలం మోత్కురావుపేట అడవుల్లోకి వెళ్లి రహస్యంగా చర్చలు జ రిపి సామూహిక లొంగుబాటుకు బాటలు వేశారు.

మూలవాగులో జనశక్తి నిమజ్జనం

అప్పటికే మూడు దశాబ్దాల ఉద్యమ చరిత్ర గల జనశక్తి సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, కామారెడ్డి, భీంగల్‌ ప్రాంతాల్లో బలమైన ప్రజా ఉద్యమాన్ని నడిపించేది. 1989లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లాకు చెందిన ఎన్‌.వీ.కృష్ణయ్యను గెలిపించడంతో జనశక్తి కీలకంగా ఉంది. వేములవాడకు చెందిన కూర రాజన్న అలియాస్‌ రాజేందర్‌ నాయకత్వంలో ఉద్యమం బలపడింది. 46 మంది సాయుధ నక్సలైట్ల లొంగుబాటులో ఆ పార్టీ బలహీనపడింది. ఈ నేపథ్యంలో అప్పటి ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ వేములవాడ మూలవాగులో మాజీ నక్సలైట్లతో జనశక్తి పార్టీని నిమజ్జనం చేశారు. జనశక్తి మిలిటెంట్లపై కేసులు ఎత్తివేస్తున్నామని, ఇకపై అసాంఘిక కార్యక్రమాలు మానివేయాలని కోరుతూ మూలవాగులో పోలీస్‌ రికార్డుషీట్లను దహనం చేశారు. అంతకుముందు వేములవాడ ఆర్యవైశ్యభవన్‌లో జనశక్తి పార్టీ శ్రేణులతో ఎస్పీ సమావేశం నిర్వహించి నిమజ్జన లక్ష్యాలను వివరించారు.

పునర్‌నిర్మాణంలో ఆటుపోట్లు

పోలీసులు చేపట్టిన వేములవాడ నిమజ్జనాన్ని జనశక్తి నాయకత్వం సవాల్‌గా తీసుకుంది. ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేసింది. అప్పటికే 46 మందితో లొంగిపోయిన గుట్టన్న దళనేతగా మరో రెండు దళాలను ఏర్పాటు చేశారు. ఇందులో కిరణ్‌, సంజీవ్‌ దళాలు సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతంలో పనిచేస్తూ కొత్తగా పార్టీ కేడర్‌ను రిక్రూట్‌మెంట్‌ చేసే ప్రయత్నం చేశారు. కోనరావుపేట మండలం వట్టిమల్ల వద్ద ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లను గుట్టన్న దళం కాల్చిచంపగా.. ప్రతిగా మరుసటి రోజే పోలీసులు చందుర్తి మండలం సనుగుల వద్ద ఇద్దరిని ఎన్‌కౌంటర్‌ చేశారు. గుట్టన్న సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపం వద్ద ఎన్‌కౌంటర్‌ అయ్యాడు. 2004లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరపగా.. మావోయిస్టు నాయకులతోపాటు జనశక్తి పక్షాన అప్పటి రాష్ట్ర కార్యదర్శి అమర్‌ అలియాస్‌ కూర దేవేందర్‌, రాష్ట్ర కమిటీ సభ్యుడు రియాజ్‌ అలియాస్‌ వెంకటేశ్‌ పాల్గొన్నారు. చర్చల అనంతరం 2005 జూన్‌ 30న ముస్తాబాద్‌ మండలం బదనకల్‌ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో రియాజ్‌తోపాటు మరో నలుగురు మరణించారు. జనశక్తి అగ్రనేత కూర రాజన్నను ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో, మరో అగ్రనేత అమర్‌ అలియాస్‌ దేవేందర్‌ను మహారాష్ట్రలోని పుణేలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో లొంగుబాట్లు, పోలీసు నిర్బంధంతో జనశక్తి సాయుధ దళాలు కనుమరుగయ్యాయి.

కుంగుబాటు.. లొంగుబాటు!1
1/1

కుంగుబాటు.. లొంగుబాటు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement