
దమ్‌మారో దమ్!
మాదకద్రవ్యాల హబ్‌గా పారిశ్రామిక ప్రాంతం
బావుపేట కేంద్రంగా విచ్చలవిడిగా దందా
ఇతర రాష్ట్రాల నుంచి జోరుగా గంజాయి, నల్లమందు సరఫరా
కొత్తపల్లి(కరీంనగర్): ‘దమ్ మారో దమ్’ అంటూ పారిశ్రామిక ప్రాంతం మత్తులో జోగుతోంది. మాదకద్రవ్యాలకు అలవాటు పడి ఓ వైపు యువత జీవితాన్ని నిర్వీర్యం చేసుకుంటుండగా.. మరో వైపు చేసిన కష్టాన్ని మరచిపోయేందుకు కార్మికులు వ్యసనంగా మార్చుకుంటున్నారు. పోలీసుల ఆపరేషన్‌లో దొరికింది గోరంతా.. రవాణా అవుతోంది కొండంతా అని తేలుతోంది. పోలీసుల అప్రమత్తంగా ఉన్నా పరిమిత స్థాయిలోనే పట్టుకోగలుతున్నారు. అయినా రవాణా ఆగడం లేదు.
బావుపేట కేంద్రంగా..
మండలంలోని బావుపేట, ఖాజీపూర్, ఎలగందుల, బద్ధిపల్లి, కమాన్‌పూర్, నాగులమల్యాల, పక్కనున్న ఒడ్యారం గ్రామాల్లో వందలాదిగా గ్రానైట్ క్వారీలు, కట్టింగ్ పరిశ్రమలు వెలిశాయి. వీటిలో పనిచేసే వారంతా రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్, ఝార్కండ్, మహారాష్ట్ర, ఒడిశా, అస్సాం సహా 12 రాష్ట్రాల నుంచి వలస వచ్చారు. అందుకే బావుపేట పారిశ్రామిక ప్రాంతాన్ని మినీ ఇండియా పిలుస్తుంటారు. ముఖ్యంగా బావుపేట కేంద్రంగా ఈ దందా విచ్చలవిడిగా సాగుతోంది. మాదకద్రవ్యాలు సేవించిన కార్మికులు విచక్షణ కోల్పోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా గొడవలు, హత్యలు, అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని నియంత్రించడంలో అబ్కారీ, పోలీసు శాఖలు విఫలమవుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇతర రాష్ట్రాల నుంచి..
పర్యవేక్షణ లోపించి ఇతర రాష్ట్రాల నుంచి బావుపేటకు మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయి. ఒడిశా, మధ్యప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి గంజాయి, రాజస్థాన్ నుంచి నల్లమందు (ఇదోరకం డ్రగ్) సరఫరా అవుతోంది. అయితే వీటిని రోడ్డు మార్గం ద్వారా రవాణా చేస్తుండగా, తనిఖీలు లేక మాదకద్రవ్యాల సరఫరా జోరందుకుంది. కాగా, కరోనాకు ముందు కార్మికులు కేవలం రైళ్లలో రాకపోకలు సాగించేవారు. ప్రస్తుతం బస్సుల ద్వారా ప్రయాణిస్తుండడంతో గంజాయి, నల్లమందు రవాణా అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అమావాస్య రోజు ఆగమాగం
గ్రానైట్ కార్మికులకు అమావాస్య రోజు సెలవు దినం కావడంతో విచ్చలవిడిగా మద్యం, మాదక ద్రవ్యాలు సేవించి ఆగమాగం చేస్తుంటారు. ఆరోజు కార్మికులంతా ఒక చోట చేరి విందులో మునిగితేలుతారు. దీనిలో భాగంగానే గంజాయి, నల్లమందు సేవిస్తూ విచక్షణ కోల్పోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం జరుగుతోంది. ఈ దాడులు కాస్త శ్రుతిమించి హత్యల వరకు వెళ్లిన ఘటనలు సైతం ఉన్నాయి. అమావాస్య నాడు గ్రానైట్ పరిశ్రమల యజమానులు అటు వైపు వెళ్లరంటే కార్మికులు ఏ స్థాయిలో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అంతేగాకుండా బావుపేట మార్కెట్ రోడ్‌లో వెళ్లేందుకు స్థానికులు, మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా గ్రానైట్ అసోసియేషన్ మాత్రం పట్టించుకోవడం లేదు. గ్రానైట్ పరిశ్రమలపై నిఘా పెంచి గంజాయి, నల్లమందు అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

దమ్‌మారో దమ్!