
దసరా సంబరం మరవకముందే..
ధర్మపురి: దసరా పండుగ కోసం యువ వైద్యుడు ధర్మపురికి వచ్చి తల్లిదండ్రులతో ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నాడు. దసరా ఆనందం మరవకముందే హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం చెందడం ధర్మపురిలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాలు.. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన కస్తూరి రాంకిషన్ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కస్తూరి జగదీశ్(32) అమెరికాలో విద్యాభ్యాసం చేసి హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో పిల్లల వైద్య నిపుణుడిగా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి అత్యవసర పనులపై ద్విచక్ర వాహనంపై బయటకెళ్లాడు. ఫ్లయోవర్ వద్ద వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో జగదీశ్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెనక కూర్చున్న మరో స్నేహితుడికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ధర్మపురికి తీసుకొచ్చారు.
చితికి నిప్పు పెట్టిన తండ్రి
వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ఆలనాపాలనా చూడాల్సిన కొడుకును రోడ్డు ప్రమాదం కబళించుకుపోయింది. తల్లిదండ్రులకు తలకొరివి పెట్టాల్సిన కొడుకుకు తండ్రే తలకొరివి పెట్టడం అందరినీ కలచివేసింది.
గుమ్లాపూర్ వాసి..
కోరుట్ల రూరల్: మోహన్‌రావుపేట గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుమ్లాపూర్ గ్రామానికి చెందిన ఇల్లెందుల శ్రీనివాస్(49) అనే వ్యక్తి మృతిచెందాడు. శ్రీనివాస్ తన బంధువు సాయికృష్ణతో కలిసి మేడిపెల్లి వైపు నుంచి గుమ్లాపూర్ వస్తుండగా.. మోహన్‌రావుపేట శివారులో జాతీయ రహదారిపై కారు ఢీకొట్టగా శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ సాయికృష్ణను మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్పంగా గాయాలయ్యాయి. శ్రీనివాస్‌కు ఇద్దరు కుమారులు, ఓ కూతురున్నారు. శ్రీనివాస్ భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పై చిరంజీవి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యువ వైద్యుడు దుర్మరణం

దసరా సంబరం మరవకముందే..