
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో తాళం వేసిన ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. బాధితుడు బాకం రామ్మూర్తి వివరాల ప్రకారం.. దసరా పండుగకు కల్వచర్ల గ్రామానికి వచ్చి పండుగ అనంతరం ఇంటికి తాళం వేసి తన తల్లిదండ్రులను తీసుకొని ఈనెల 7న పెద్దపల్లికి వెళ్లాడు. ఆదివారం ఉదయం తన తండ్రి రాజయ్య కల్వచర్లలోని తన ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా.. గుర్తుతెలియని వ్యక్తులు బీరువా పగలగొట్టి అందులో ఉన్న 4 తులాల బంగారు ఆభరణాలు, సుమారు రూ.96వేల విలువైనవి ఎత్తుకెళ్లారు. రామ్మూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.శ్రీనివాస్ తెలిపారు.
మహిళ మెడలోంచి గొలుసు అపహరణ
కథలాపూర్: తక్కళపెల్లి శివారులో సినీ ఫక్కీ తరహాలో ఆదివారం చోరీ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన నాగెల్లి గంగు–బుచ్చయ్య దంపతులు బొమ్మెన గ్రామంలోని ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నారు. ఈక్రమంలో తక్కళపెల్లి శివారులోని వరద కాల్వ వద్దకు చేరుకోగానే వెనక నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు గంగు మెడలోని 2 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు.