
తల్లి సంవత్సరికం రోజే తనయుడి మృతి
● ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన బొలెరా ● మంథని–కాటారం రహదారిపై గ్రామస్తుల ఆందోళన
మంథనిరూరల్: ఆ కుటుంబాన్ని విధి వెంటాడింది.. తల్లి మరణించి ఏడాది గడిచి మాసికం చేసుకున్న రోజునే మరొకరి మరణవార్త వినాల్సి వచ్చింది. కన్నతల్లి ఏడాది మాసికం రోజు తనయుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగెపల్లిలో చోటు చేసుకుంది. మంథని మండలం నాగేపల్లి గ్రామ శివారులోని మంథని–కాటారం ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనాన్ని బొల్లొరా వాహనం ఢీకొట్టిన సంఘటనలో నాగెపల్లికి చెందిన ముక్కెర సమ్మయ్య(30) అనే యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది సమ్మయ్య తల్లి మృతి చెందగా గురువారం ఏడాది మాసిక కార్యక్రమం చేశాడు. అయితే సమీపంలోని అడవిసోమన్‌పల్లి గ్రామంలో తన చిన్నమ్మ ఉండగా ఆమెను తీసుకురావడానికి తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా నాగెపల్లి దాటిన తర్వాత లారీని ఓవర్ టేక్ చేస్తూ వచ్చిన బొల్లొరా వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సమ్మయ్య అక్కడికకక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మృతుడి బంధువులు, కుటుంబసభ్యులు, గ్రామస్తులు మంథని–కాటారం ప్రధాన రహదారిపై మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న మంథని ఎస్సై రమేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న మృతుడి బంధువులకు న్యాయం జరిగేలా చూస్తానని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.