
ఎంత పనాయే !
ఎన్ని‘కలలు’ కల్లలాయే !
దావతులు మీదపడే.. నామినేషన్ల ఊసు లేదాయే..
‘స్థానికం’ ఆశల్లో వదిలిన చేతిచమురు
అంతర్మథనంలో ఆశావహులు
సిరిసిల్ల: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం.. రిజర్వేషన్ల ఖరారవడం.. ఎన్నికల తేదీ.. ఫలితాల ముహూర్తం సైతం ఫిక్స్ కావడంతో ఆశావహులు పోటీ చేసేందుకు ఆశపడ్డారు. ఇంతలోనే దసరా పండుగ రావడంతో గత పది రోజులు పల్లెల్లో దావత్‌లు జోరందుకున్నాయి. కులసంఘాలను, యువకులను కలుస్తూ మందు, విందులు ఏర్పాటు చేశారు. ‘స్థానిక సంస్థల’ ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యుడిగా, జెడ్పీటీసీ అభ్యర్థిగా, గ్రామసర్పంచ్‌గా, వార్డు సభ్యుడి పదవులపై ఆశలు పెట్టుకున్న వారు బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. అన్నీ సిద్ధం చేసుకున్న తరుణంలో ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించడంతో ఆశావహుల ఆశలన్నీ ఆవిరయ్యాయి. వైకుంఠపాళీలో పెద్దపాము మింగినట్లు ఎన్ని‘కలలు’ కల్లలయ్యాయి. మళ్లీ ఆట మొదటికొచ్చినట్లయింది.
పన్నులు చెల్లించి రశీదులు పొందినా..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి, నామినేషన్‌ను ప్రతిపాదించే వ్యక్తులను, బలపరిచే వారు ఎలాంటి పన్ను బకాయిలు ఉండొద్దు. బకాయిలుంటే నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది. ఈక్రమంలో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులే ముందుచూపుతో నామినేషన్‌పత్రంలో ప్రతిపాదించే వ్యక్తి, బలపరిచే వ్యక్తుల ఇంటి పన్నులు, నల్లా పన్నులను చెల్లించి రశీదులు పొందారు. అభ్యర్థులంతా ఒక్కొక్కరు మరో ఇద్దరి బకాయిలు క్లియర్ చేశారు. ఇంతలోనే ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో అవాక్కయ్యారు. ఇప్పటికే చేసిన ఖర్చును తలచుకుని అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. అన్నింటికీ మించి ఇంట్లో ఈ రాజకీయాలు వద్దు అని ముందునుంచే చెబుతున్నా ఇంటి ఆవిడ ముందు(భార్య) ఎన్నికల దావత్‌ల ఖర్చుల లొల్లి తలనొప్పిగా మారింది.
దావత్‌లు దండగాయే..
ఇవన్నీ ఒక ఎత్తయితే.. గత పది రోజులుగా చేసిన దావత్‌ల ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. ఖరీదైన మందు, చికెన్, యాటపోతుల కూరలతో పోటాపోటీగా విందు రాజకీయాలు నడిపారు. దసరా పండుగ నేపథ్యంలో దూరపు ప్రాంతాల్లోని వారు సైతం సొంతూరికి రావడంతో వారికి ఓటుహక్కు ఉందని తెలిసి మందు, విందులతో ఆత్మీయతను చాటుకున్నారు. దసరా పండుగ జోరులో దావత్‌లు ఎక్కువయ్యాయి. పది రోజులు అన్ని ఊర్లలోనూ స్థానిక సంస్థల ఎన్నికల మందు, విందులకు ఆశావహుల చేతిచమురు భారీగానే వదిలింది. ఇంత చేసి నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకుని, ముహూర్తం కోసం చూస్తుండగా.. హైకోర్టు గురువారం ఎన్నికలపై స్టే విధించడంతో ఆశావహుల గుండెల్లో బండపడినట్లు అయింది. ఇన్ని రోజులు ఇచ్చిన దావత్‌లన్నీ దండగాయే.. మల్లా ఎన్నికల తరువాయి వచ్చేసరికి మళ్లీ ఖర్సులు తప్పవని బాధపడుతున్నారు. ఎంత పనాయే అంటూ.. లోలోపల మదనపడుతున్నారు.