
పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కన్నతల్లికి ద్రోహం చేసిన
కరీంనగర్‌టౌన్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు మొదలు రాష్ట్రస్థాయి నాయకుడి వరకు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. ఆయా నేతలు నివసించే గ్రామాలు, మండలాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తేనే పేరు ప్రఖ్యాతలు ఉంటాయని స్పష్టం చేశారు. తనను ఎంపీగా గెలిపించింది కార్యకర్తలేనని, స్థానిక సంస్థల్లో వాళ్లను గెలిపించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని అన్నారు. గురువారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆ పైస్థాయి నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల ఇన్‌చార్జిలు గంగిడి మనోహర్‌రెడ్డి, శాంతికుమార్, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. బీజేపీ అభ్యర్థికోసం కాకుండా ఇతరుల గెలుపుకోసం పనిచేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లేనని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు.