
నీళ్ల పప్పు.. పల్చటి పాలు
కరీంనగర్‌టౌన్: నీళ్ల పప్పూ, సాంబారు, పల్చటి పాలు.. మజ్జిగ కన్నా పల్చనైన పెరుగు.. మెనూలో కనిపించని గుడ్డు.. దొడ్డు బియ్యంతో అన్నం, నాణ్యత లేని కూరలు.. ఇదీ కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న భోజనం. ఈ నాసిరకమైన భోజనాన్ని తినలేకపోతున్నామని రోగులు గగ్గోలు పెడుతున్నారు. రోజూ రోగులకు అందించే మెనూపై పర్యవేక్షణే కరువైందని, అసలు తమ గోడు పట్టించుకునే వారేలేరని రోగులు ఆరోపిస్తున్నారు. డైట్ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. రోగులకు పోషకాహారం అందించాల్సిన కాంట్రాక్టర్లు నాసిరకం భోజనం పెడుతూ కాసులు వెనకేసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు.
మెనూ లేదు... నాణ్యత లేదు
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లుగా చేరే రోగులకు చికిత్సతో పాటు ఆహారంలో నాణ్యత కరువైంది. నీళ్లలాంటి పప్పు, పలుచని పాలు, రుచిలేని కూరలు, దొడ్డు బియ్యం అన్నంతో రోగుల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందడం లేదు. ప్రభుత్వం ఒక్కో ఫేషెంట్‌కు రూ.70తో పాటు హైప్రోటీన్ డైట్(హెచ్‌పీడీ), డాక్టర్స్ డైట్‌కు రెట్టింపు ధరలు చెల్లిస్తోంది. అయినప్పటికీ మెనూ అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. గర్భిణులు, బాలింతలు, ఆపరేషన్లు అయిన పేషెంట్లకు హైప్రోటీన్ డైట్‌లో ప్రతీపూట రెండు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్కటే ఇస్తున్నారు. అదికూడా ఒకవార్డులో ఇస్తే మరోవార్డులో ఇవ్వడం లేదని చెబుతున్నారు.
రుచి పచి లేని భోజనం
ప్రభుత్వ ఆస్పత్రిలో డైట్ క్యాంటీన్ నిర్వాహకులు ఇష్టానుసారం రుచిలేని భోజనం వడ్డిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రి ఆవరణలో ప్రతి రోజు నిర్వహించే అన్నదానం భోజనం ఆస్పత్రిలోపల ఇచ్చే భోజనం కన్నా బాగొంటోందని రోగులు చెబుతున్నారు. ఆస్పత్రిలో నిఘా కరువవడంతో డైట్ కాంట్రాక్టర్ నిబంధనలు పాటించకుండా, నాణ్యతను పక్కన పెట్టి లాభాల కోసం మాత్రమే పనిచేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నీరుగారుతున్న లక్ష్యం
పేషెంట్లకు బలవర్ధకమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చుచేస్తున్నప్పటికీ ఆ ఆహారంలో పోషకాలు లేకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ఆరోగ్య శాఖకు చెడ్డ పేరు వస్తోంది. ఆసుపత్రిలో, క్యాంటీన్లో మెనూ ఏం పెడుతున్నారనే ప్రదర్శన ఎక్కడా కనిపించదు. రోజువారీ నాణ్యత తనిఖీలు, ఫిర్యాదు నంబర్లు ఏర్పాటు చేయాలని ఆస్పత్రికి వచ్చే రోగులు కోరుతున్నారు.
ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్లకు ఇచ్చే భోజనం క్వాలిటీగా ఉండేలా చర్యలు చేపడతాం. గతంలోనే ఈ విషయాన్ని డైట్ కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. మరోసారి క్వాలిటీ విషయాన్ని కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లి మంచి భోజనం అందేలా చూస్తాం. నిబంధనల ప్రకారం క్వాలిటీ లేకుంటే శాఖాపరమైన చర్యలు చేపడతాం.
– వీరారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్