గోదావరిఖని/రామగుండం: పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణకు అరుదైన అవకాశం దక్కింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు ఆయనకు ఆహ్వానం అందింది. ఈ మేరకు మంగళవారం ఆయన అమెరికాకు బయలుదేరి తరలివెళ్లారు. ప్రపంచ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు మనదేశానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలకు అవకాశం దక్కింది. ఇందులో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఉండడం గమనార్హం. ఉత్తరాఖండ్‌కు చెందిన కుమారి షెల్జా కూడా ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరవుతారు.
కాగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికై న వంశీకృష్ణకు ఏకంగా ప్రపంచ దేశాల ప్రతినిధులతో కలిసి ఐక్యరాజ్య సమితిలో సమావేశమయ్యే అవకాశం రావడం విశేషం. ఆయన అభిమానులు పి.మల్లికార్జున్, డీఆర్‌యూసీసీ ప్రతినిధి అనుమాస శ్రీనివాస్ ఎంపీని అభినందించారు. వివిధ దేశాల అవృద్ధి, సామాజిక న్యాయం, విద్య, ఉపాధి అవకాశాల పెంపు తదితర అంశాలపై ఐక్యరాజ్య సమితి చర్చించనున్నట్లు ఎంపీ వివరించారు.
పోలీసుల తనిఖీల భయంతో..
గోదావరిఖని: పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారనే భయంతో తప్పించుకునే ప్రయత్నంలో ద్విచక్రవాహనంపై నుంచిపడి యువకుడు తీవ్రగాయాలపాలయ్యాడు. స్థానిక బాపూజీనగర్‌కు చెందిన అజయ్ మంగళవారం ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. పోలీసులు తనిఖీ చేస్తున్నారని గమనించి వాహనాన్ని వేగంగా వెనక్కి తిప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో మరో వాహనాన్ని ఢీకిని కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు రెఫర్ చేశారు.

ఐక్యరాజ్య సమితి సమావేశానికి పెద్దపల్లి ఎంపీ