కరీంనగర్‌క్రైం/ కరీంనగర్‌టౌన్: మాదకద్రవ్యాలపై అవగాహన, వెల్నెస్ నావిగేషన్ పథకంలో భాగంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సోమవారం న్యాయ సహాయ కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి న్యాయసహాయమైనా అందించేందుకు జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ కేంద్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. కేంద్రంలో ఒక న్యాయవాదిని, పారా లీగల్ వలంటీర్‌ను నియమించినట్టు పేర్కొన్నారు. మద్యానికి, మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దని ఆసుపత్రికి వచ్చిన రోగులకు సూచించారు. ఆస్పత్రి పర్యవేక్షణ అధికారి వీరారెడ్డి, లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేశ్, మానసిక రోగుల విభాగ అధిపతి అజయ్‌కుమార్, ఇతర వైద్యులు పాల్గొన్నారు.
రేపు, ఎల్లుండి నల్లా బంద్
కరీంనగర్ కార్పొరేషన్: ఫిల్టర్‌బెడ్‌లో మరమ్మతు పనులు జరుగుతున్నందున ఈనెల 8, 9 తేదీల్లో నగరంలో తాగునీటి సరఫరా ఉండదని నగరపాలకసంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజ్‌కుమార్ తెలిపారు. నగర పరిధిలోని అన్ని డివిజన్‌లలో ఈ రెండు రోజులు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. నగరవాసులు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
క్వింటాల్ పత్తి రూ.6,500
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ పత్తి రూ. 6,500 పలికింది. క్రయ విక్రయాలను ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
దరఖాస్తులకు నేడు చివరి తేదీ
చొప్పదండి: 2026–27 విద్యా సంవత్సరానికి గాను పీఎంశ్రీ నవోదయ విద్యాలయంలో తొమ్మిదో తరగతి, పదకొండవ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థులు మంగళవారం సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి కోరారు. గత నెలలో దరఖాస్తు గడువు తేదీ ముగిసినా ఈనెల 7 వరకు గడువు పెంచడం జరిగిందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి చదువుతున్నవారు తొమ్మిదో తరగతిలో, పదో తరగతి చదువుతున్నవారు పదకొండవ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నవోదయ విద్యాలయంలో సీబీఎస్‌ఈ విధానంలో విద్య కొనసాగుతుందని, దరఖాస్తులను నవోదయ వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఆన్‌లైన్‌లో పంపించవచ్చని వివరించారు.
సిటీలో నేడు కరెంట్ కట్
కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, లైన్ల సరిదిద్దే పనులు చేపడుతున్నందున మంగళవారం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మార్కండేయనగర్, ప్రగతినగర్, లారెల్ స్కూల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఇరుకుల్ల, మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్, తాహెర్‌కొండాపూర్, బహద్దూర్‌ఖాన్‌పేట, దుబ్బపల్లి, చామన్‌పల్లి, చేగుర్తి, నల్లగుంటపల్లి వ్యవసాయ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు వివరించారు.
మద్యం దుకాణాలకు 42 దరఖాస్తులు
కరీంనగర్‌క్రైం: జిల్లాలోని వైన్స్‌లకు దుకాణాలకు 42 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. సోమవారం ఒక్కరోజే 41 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు.

జిల్లా ఆస్పత్రిలో న్యాయ సహాయ కేంద్రం