
ఉన్నత విద్యకు ‘అంబేడ్కర్ విద్యానిధి’
కరీంనగర్: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం ఓ వరంగా మారింది. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం కింద గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి 210 మంది విద్యార్థులకే సాయం అందించింది. ఇటీవల ప్రభుత్వం ఏటా 500 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. అభ్యర్థులు చదివే కోర్సు ఫీజులను బట్టి గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. తెలంగాణ ఈ– పాస్ వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థి వివరాలను పూరించి సంబంధిత ధ్రువపత్రాలను జేపీజీ ఫార్మాట్‌లో జతపర్చాలి. రాష్ట్రస్థాయిలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపడుతుంది. జీఆర్‌ఈ/జీమ్యాట్‌లో ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికై న వారికి విదేశీ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రవేశ లేఖ ఆధారంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక స్యాం అందజేస్తారు. కోర్సులో చేరిన వారు మొదటి సంవత్సరం నుంచి రెండో సంవత్సరంలోకి ప్రవేశించినట్లు ఽధ్రువపత్రాలు పంపిస్తేనే ఫీజుకు సంబంధించిన సాయం విడుదల చేస్తారు. అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించకపోతే సాయం నిలిచిపోతుంది.
అర్హులు ఎవరంటే..?
కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. జీఆర్‌ఈ/జీమ్యాట్‌లో అర్హత మార్కులు సాధించాలి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్టులో ప్రతిభ కనబరచాలి. ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థి మాత్రమే అర్హులు. నవంబర్ 19 వరకే దరఖాస్తు గడువు. ఆమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో చదువుకోవచ్చు.
కావాల్సిన ధ్రువపత్రాలు...
పాస్‌పోర్టు సైజ్‌ఫొటో. బోనాఫైడ్ సర్టిఫికెట్. ఆధార్, రేషన్ కార్డు. స్థానికత ఽధ్రువపత్రం. పదో తరగతి మెమో. చివరి కోర్సు మార్కుల మెమో. బదిలీ సర్టిఫికెట్. జీఆర్‌ఈ/జీమ్యాట్/ ఇతర స్కోర్‌కార్డు. బ్యాంకు ఖాతా పుస్తకం. విదేశీ విశ్వవిద్యాలయ ప్రవేశ లేఖ. పాస్‌పోర్టు కాపీ.
దళిత విద్యార్థుల ఉన్నత చదువులకు చక్కటి అవకాశం
రూ.20లక్షల వరకు రుణం పొందే అవకాశం
పది దేశాల్లో చదివేందుకు ప్రాధాన్యం