
పత్తి రైతుకు శఠగోపం
కరీంనగర్ అర్బన్: తెల్లబంగారం పండించే రైతుకు కేంద్ర ప్రభుత్వం శరగోపం పెట్టింది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తిపై సుంకాన్ని ఎత్తివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావం మద్దతు ధరపైనా పడనుంది. జిల్లావ్యాప్తంగా 45వేల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా మద్దతు ధర దక్కక సాగు విస్తీర్ణం పడిపోతోంది.
దిగుమతి సుంకం ఎత్తివేతతో నష్టం
దేశంలో పంట చేతికి అందే కీలక సమయానికి పత్తి దిగుమతిపై ఉన్న 11శాతం సుంకాన్ని తగ్గించడంతో స్పిన్నింగ్ మిల్లులు విదేశాల నుంచి పంట దిగుమతితోపాటు నిల్వ చేసుకునే అవకాశం కల్పించింది. మొదట సుమారు 40 రోజులపాటు సెప్టెంబర్ 30 వరకు దిగుమతి సుంకం ఎత్తివేసిన కేంద్రం.. తర్వాత డిసెంబర్ 31 వరకు పొడిగించింది. మిల్లర్ల ఒత్తిడి మేరకే కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి పంట దిగుమతులు చేసుకునేలా సుంకం భారాన్ని తగ్గించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత సీజన్లో ధరపై కచ్చితంగా తీవ్ర ప్రభావం ఉంటుందని పత్తి రైతులు భావిస్తున్నారు.
ఆందోళనలో రైతాంగం
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతులు, రైతు సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర కన్నా వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లోనూ నాణ్యత సాకుగా మద్దతు ధరకు అటు, ఇటుగా రైతులు విక్రయించుకుంటున్నారు. పెట్టుబడి తెచ్చుకుని వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి మరింత దీనంగా ఉంటోంది. అడ్తి వ్యాపారి చెప్పిన ధరకే పంటను విక్రయించుకోవాల్సిన దుస్థితి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ధర మరింత తగ్గిపోతుందేమోననే ఆవేదన రైతుల్లో కనిపిస్తోంది.
యేటా తగ్గుతున్న సాగు
జిల్లాలో పత్తిసాగు ఏటా తగ్గుతోంది. 2010లో 90వేల ఎకరాల్లో సాగవగా ప్రస్తుతం 45వేల ఎకరాలకు చేరింది. 2012లో 85వేలు, 2014లో 73వేలు, 2018లో 65వేలు, 2020లో 58వేలు, 2024లో 50వేల ఎకరాల్లో పత్తి సాగవగా ఏటా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతోంది. 2010– 2025 గణాంకాలను పరిశీలిస్తే దాదాపు సగానికి పైగా సాగు తగ్గింది. పెట్టుబడులు ఎక్కువవుతుండటం, మద్దతు ధర దక్కకపోవడంతో సాగుకు స్వస్తి పలుకుతున్నారు. ఒక్కో ఎకరం సాగు ఖర్చు సుమారు రూ.35వేల నుంచి రూ.50వేల వరకు అవుతోంది. సొంత భూమి ఉన్న రైతుల ఖర్చు రూ.30వేలకు పైగానే ఉంటోంది. కౌలు రైతులు రూ.50 వేలకు పైగానే పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. దిగుబడి సగటున 6క్వింటాళ్లు ఉంటే.. పొట్టి రకం రూ.46 వేలు, పొడుగు రకం రూ.48 వేల మధ్య ఆదాయం లభిస్తోంది. ఈ లెక్కన రైతుకు నష్టమే తప్ప లాభాలు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పంట కొనాల్సి ఉన్నా.. రైతు చేతికి పంట అందే సమయానికి ఏదో ఒక సమస్య వెంటాడుతోంది. తేమ శాతాన్ని సాకుగా చూపుతుండడంతో తక్కువ ధరకే రైతులు అమ్ముకోవాల్సి వస్తోంది. దిగుమతి సుంకం ఎత్తివేయడం వల్ల పత్తి రైతులు క్వింటాకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు నష్టపోవచ్చని రైతు సంఘం నాయకులు అంచనా వేస్తున్నారు.
జిల్లా సాగు విస్తీర్ణం: 3.30 లక్షల ఎకరాలు
పత్తి సాగు విస్తీర్ణం: 45,000 ఎకరాలు
దిగుబడి అంచనా: 2.70 లక్షల క్వింటాళ్లు
ఎకరాకు దిగుబడి అంచనా: 6 క్వింటాళ్లు