
వరుణుడి ప్రకోపం.. రైతన్నకు నష్టం
చొప్పదండి/చిగురుమామిడి/మానకొండూర్/గంగాధర: జిల్లాలో ఆదివారం గాలివాన కురియడంతో వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చొప్పదండి మండలం గుమ్లాపూర్, చిట్యాలపల్లి, చొప్పదండి తదితర ప్రాంతాల్లో వరి నేల కొరిగింది. చిగురుమామిడి మండలం పీచుపల్లి, చిన్నముల్కనూర్, రా మంచ, ముదిమానిక్యం, చిగురుమామిడిలో కోతకొచ్చిన వరిపంట నేలవాలడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మానకొండూర్ మండలంలోని మద్దికుంట, కెల్లెడ, దేవంపల్లి, కొండపల్కల, గంగిపల్లి, పచ్చునూర్ గ్రామాల్లో వరిపంట నేలకొరిగి, ధాన్యం రాలిపోయింది. వరుసగా వర్షాలు పడితే పంట చేతికందుతుందోలేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంగాధర మండలంలోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. పంటనష్టంపై సర్వే నిర్వహించి, రైతులకు పరిహారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు.