
అన్నపై తమ్ముళ్ల హత్యాయత్నం
మానకొండూర్: సొంత అన్నపై తమ్ముళ్లు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని వన్నారం పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ బి.సంజీవ్ వివరాల ప్రకారం.. కొత్తపల్లికి చెందిన బోయిని కొమురయ్య, తన తమ్ముళ్లు ఆంజనేయులు, లక్ష్మణ్‌కు మధ్య గత కొన్ని నెలలుగా భూ తగాదాలు జరుగుతున్నాయి. ఇటీవల బోయిని కొమురయ్య భార్య లక్ష్మీని ఆంజనేయులు దూషించడంతో పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. శనివారం వేకువజామున కొమురయ్య పొలం వద్దకు వెళ్తుండగా ఆంజనేయులు, లక్ష్మణ్ ఇనుపసిల్లాతో గుచ్చి హత్యాయత్నానికి యత్నించారు. కొమురయ్య అరుపులు విన్న భార్య, స్థానికులు ఘటన స్థలానికి వెళ్లడంతో లక్ష్మణ్, ఆంజనేయులు పారిపోయారు. క్షతగాత్రుడిని 108 వాహనంలో కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
లారీ దొంగతనం.. నాలుగు నెలల జైలు
కొత్తపల్లి(కరీంనగర్): లారీ దొంగతనం కేసులో నిందితుడికి నాలుగు నెలల జైలు శిక్ష, రూ.300 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. పోలీసుల కథనం ప్రకారం.. బావుపేటలో నివాసముండే ఉత్తరప్రదేశ్‌కు చెందిన సయ్యద్ అలీ జనవరి 29వ తేదీన పిల్లల రాజుకు చెందిన లారీని దొంగలించాడు. దర్యాప్తు చేపట్టిన కొత్తపల్లి పోలీసులు లారీని స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడిని అరెస్టు చేశారు. సాక్షుల వాంగ్మూలాలను కోర్టులో సమర్పించడం ద్వారా నేరం రుజువైంది. కోర్టు సయ్యద్ అలీకి నాలుగు నెలల జైలు శిక్ష, రూ.300 జరిమానా విధించింది. ఈ కేసులో నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన అప్పటి కరీంనగర్ రూరల్ సీఐ ప్రదీప్, ఎస్సై సాంబమూర్తి, కోర్టు కానిస్టేబుల్ మౌనికను సీపీ గౌస్‌ఆలం అభినందించారు.