
పింఛన్ ఇప్పించండి మహాప్రభో..
వేములవాడరూరల్: ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వికలాంగుడు తనకు పింఛన్ ఇప్పించాలని మూడేళ్లుగా అధికారులు, నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. రెక్కాడితే కాని డొక్కాడని ఆ కుటుంబం పింఛన్ కోసం ఎదురుచూస్తుంది. అనుకోని పరిస్థితుల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. ఇది ఇన్‌ఫెక్షన్‌గా మారి వైద్యులు కాలును తొలగించారు. మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఆయనకు ఎలక్ట్రికల్ వాహనాన్ని ఇచ్చింది. కానీ పింఛన్ రావడం లేదు. వేములవాడరూరల్ మండలంలోని ఫాజుల్‌నగర్‌కు చెందిన దుర్గపు నారాయణకు పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. కాలుకు ఇన్‌ఫెక్షన్ కావడంతో మూడేళ్ల క్రితం తొలగించారు. అప్పటి నుంచి పనిచేసుకునే పరిస్థితి లేదు. పింఛన్ ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నా ఎవరూ స్పందించడం లేదు. గ్రామంలో చిన్న టీ స్టాల్ పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇప్పటికై నా అధికారులు స్పందించి త నకు పింఛన్ మంజూరు చేయాలని కోరుతున్నాడు.