
జ్ఞాపకాలు పదిలం
సైదాపూర్: పల్లెల్లో పలువురు చనిపోయిన వారి కుటుంబ సభ్యుల విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి మధుర జ్ఞాపకాలను పదిలంగా ఉంచుతున్నారు. సాధారణంగా గ్రామాల్లో పలువురు మహాత్ముల విగ్రహాలు కనిపిస్తాయి. కానీ.. సైదాపూర్ మండలంలోని సోమారం, గర్రెపల్లి, వెన్కెపల్లి, సైదాపూర్, ఘనపూర్, సర్వాయిపేట, గొల్లగూడెం, ఆకునూర్, వెంకటేశ్వర్లపల్లి తదితర గ్రామాల్లో పలు కుటుంబాలు వారి వ్యవసాయ క్షేత్రాలు, రోడ్డు వైపు స్థలాల్లో చనిపోయిన వారి కుటుంబీకుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. వెన్కెపల్లిలోని మొలంగూర్ రోడ్డులో గడ్డం రాందాసు, శ్యామల జ్ఞాపకార్థం వారి కుమారులు పది గుంటల భూమిని కేటాయించారు. రాందాసు 1953లో, శ్యామల 2006లో మృతిచెందారు. తల్లిదండ్రులిద్దరి జ్ఞాపకార్థం సమాధిని గుడిగా నిర్మించారు. విగ్రహాలు నెలకొల్పారు. తర్వాత కోటి నామాల స్తూపం నిర్మించారు. వీరి పెద్ద కుమారుడు గడ్డం వెంకటయ్య మృతిచెందగా ఆయన విగ్రహాన్ని తల్లిదండ్రుల చెంతనే ఏర్పాటు చేశారు. సోమారంలో వీరగోని ఎల్లయ్య యుక్త వయస్సులో ఉన్నప్పుడు చిరుతల రామాయణంలో సీత వేషం(పాత్ర) వేయడంతో ఆయన సీత ఎల్లయ్యగా పిలువబడ్డాడు. క్రమంగా సన్యాసం పుచ్చుకొని తట్టుస్వామి అయ్యాడు. కొత్తగట్టు పెద్దగుట్ట మీద గుడి నిర్మించాడు. సోమారంలో సత్రం ఏర్పాటు చేశాడు. ఆయన మృతికి చిహ్నంగా అతడి తమ్ముని కుమారుడు రమేశ్ సోమారం చౌరస్తాలో విగ్రహం నిర్మించాడు. ఇలా చనిపోయిన మృతుల జ్ఞాపకాలను విగ్రహాలతో పదిలంగా ఉంచుతున్నారు.

జ్ఞాపకాలు పదిలం