
ఆర్థిక ఇబ్బందుల్లో గోపాలమిత్రలు
● ఆరునెలలుగా అందని వేతనాలు
● నిధులు విడుదల చేయాలని వినతి
పెద్దపల్లిరూరల్: పల్లెల్లోని మూగజీవాలకు పాతికేళ్లుగా వైద్య సేవలందిస్తూ గోపాలమిత్రలుగా గుర్తింపు పొందారు. ఈ ఏప్రిల్ నుంచి వేతనాలందక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. కుటుంబపోషణ కష్టంగా మారిందని కనీసం దసరా పండగ ముందైనా వేతనాలకు నిధులు విడుదల కాక పోవడంతో పండగ పూట పస్తులుండాల్సిందేనా..అని గోపాలమిత్రలు వాపోతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 119 మంది
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 119 మంది గోపాల మిత్రలు పనిచేస్తున్నారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలు చేసే అన్ని కార్యక్రమాల్లో గోపాలమిత్రలు సేవలందిస్తున్నారు. మూగజీవాలకు సోకే వ్యాధుల నియంత్రణతో పాటు గాలికుంటు, నట్టల నివారణ టీకాలను వేయడంలో వీరిల పాత్ర కీలకం. పశుసంతతిని వృద్ధి చేసేందుకు పశువుకు కృత్రిమగర్భాధారణ చేసే విధుల్లోనూ గోపాలమిత్రలదే ప్రధాన పాత్ర.
వైఎస్సార్ వచ్చాకే గౌరవవేతనం...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పశువైద్యసేవల్లో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యేలా అప్పటి పాలకులు అవకాశం కల్పించగా, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే 2006లో గోపాలమిత్రలకు రూ.1,200 గౌరవవేతనం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ మరణానంతరం సీఎంగా వ్యవహరించిన కొణిజేటి రోశయ్య రూ.3,500కు పెంచగా.. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత బీఆర్‌ఎస్ పాలకులు రూ.8,500కు పెంచారు. ప్రస్తుతం పీఆర్‌సీతో కలిపి రూ.11,050 వేతనం పొందుతున్నారు. ప్రతి నెలా టీఎస్‌ఎల్‌డీఏ (తెలంగాణ లైవ్‌స్టాక్ ఏజెన్సీ) ద్వార వేతన మొత్తాన్ని విడుదల చేస్తారు. పశువులకు కృత్రిమ గర్భాధారణ చేసేందుకు కేంద్రం అందించే రూ.100 ప్రోత్సాహకం కూడా చాలా ఏళ్లుగా రావడంలేదు.
ఉమ్మడి జిల్లాలో
గోపాలమిత్రలు
పెద్దపల్లి 39
కరీంనగర్ 39
జగిత్యాల 21
సిరిసిల్ల 20