కొత్తపల్లి(కరీంనగర్): చింతకుంట గ్రామానికి చెందిన మచ్చ భూమక్క (62) అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కొత్తపల్లి సీఐ బి.కోటేశ్వర్ తెలిపారు. మృతురాలు అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది బుధవారం రాత్రి క్రిమిసంహారక మందు తాగింది. కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. మృతురాలి కొడుకు కుమారస్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ పేర్కొన్నారు.
బార్ అండ్ రెస్టారెంట్‌లో ఒకరి హత్య
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని నిజామాబాద్‌రోడ్‌లోగల స్వప్న బార్ అండ్ రెస్టారెంట్‌లో ఒకరు హత్యకు గురయ్యారు. వెయిటర్ శ్రీనివాస్‌పై వంటమనిషి చరణ్ సింగ్ బీరుసీసాతో దాడిచేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. జగిత్యాలరూరల్ మండలం మోరపల్లికి చెందిన వంగ శ్రీనివాస్ (34)15 రోజులుగా బార్‌అండ్ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం వేకువజామున రెస్టారెంట్‌లో వంటమనిషిగా పనిచేస్తున్న నేపాల్‌కు చరణ్ దీప్ సింగ్ తోటి కార్మికులతో వాగ్వివాదానికి దిగాడు. ఆ గొడవను సర్దిచెప్పేందుకు శ్రీనివాస్ ప్రయత్నించగా.. చరణ్‌సింగ్ బీరుసీసాతో దాడిచేశాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, పట్టణ సీఐ కరుణాకర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి భార్య వంగ సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు.
కోళ్లవ్యాన్ ఢీ.. ఒకరు మృతి
రామడుగు: రామడుగు మండలం కోరటపల్లి గ్రామానికి చెందిన మేకల శ్రీధర్(27) కోళ్లవ్యాన్ ఢీకొని మృతి చెందాడు. ఎస్సై రాజు వివరాల ప్రకారం.. కోరటిపల్లి గ్రామానికి చెందిన మేకల శ్రీధర్ బుధవారం రాత్రి తన ద్విచక్రవాహనంపైన రామడుగు నుంచి స్వగ్రామం కోరటపల్లికి వెళ్తున్నాడు. షానగర్ శివారులో ఎదురుగా వచ్చిన కోళ్లవ్యాన్ ఢీకొంది. శ్రీధర్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీధర్ తండ్రి సుధాకర్ ఫిర్యాదుతో పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు..
కొత్తపల్లి(కరీంనగర్): సీతారాంపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కొత్తపల్లి సీఐ కోటేశ్వర్ వివరాల మేరకు చొప్పదండికి చెందిన కొంకటి సందీప్(24) కరీంనగర్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. గురువారం ఉదయం చొప్పదండి నుంచి కరీంనగర్‌లోని తన కార్యాలయానికి బైక్‌పై వస్తున్నాడు. సీతారాంపూర్‌లోని కేఆర్ గార్డెన్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. సందీప్ తల, ముఖంపై తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. 108లో కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.