
మిడ్‌మానేరు నీటి విప్లవం
ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో నీరు
బోయినపల్లి(చొప్పదండి): రాష్ట్రంలోని ప్రాజెక్టులకు గుండెకాయగా నిలుస్తోంది రాజన్నసిరిసిల్ల జిల్లా మాన్వాడలో నిర్మించిన మిడ్‌మానేరు(శ్రీరాజరాజేశ్వర). 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2017–18లో పనులు పూర్తికావడంతో నీటిని నిల్వ చేస్తున్నారు. అప్పటి నుంచి ఈనెల 14 వరకు ఏడేళ్లలో ఈ ప్రాజెక్టులోకి 527 టీఎంసీల నీరు వచ్చింది. ఇక్కడి నుంచి వివిధ జలాశయాలకు 465 టీఎంసీలు వెళ్లింది. ప్రాజెక్టు సామర్థ్యం 27.55 టీఎంసీలు.
527 టీఎంసీల ఇన్‌ఫ్లో
2017–18 నుంచి 2025 సెప్టెంబర్ 14 వరకు మిడ్‌మానేరులోకి కాళేశ్వరం, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ ప్రాజెక్టులతోపాటు వరద ఆధారంగా 527 టీఎంసీల నీరు వచ్చింది. కాళేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోతల ద్వారా 206.56 టీఎంసీలు వచ్చాయి. ఎస్సారెస్పీ నుంచి 153.90 టీఎంసీలు, వరద ఆధారంగా 167.09 టీఎంసీలు వచ్చి చేరాయి.
అగ్రభాగాన కాళేశ్వరం
మధ్యమానేరులోకి కాళేశ్వరం నీటిని 2019–20 నుంచి 2023–24 వరకు ఎత్తిపోశారు. కాళేశ్వరం నుంచి 175 టీఎంసీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తర్వాత కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపరమైన అంశాలతో అక్కడ నీటిని నిల్వ చేయలేదు.
465 టీఎంసీలు ఔట్‌ఫ్లో
మిడ్‌మానేరు నుంచి 2017–18 నుంచి 2025 సెప్టెంబర్ 14 వరకు 465 టీఎంసీల మేర నీరు ఔట్‌ఫ్లోగా వదిలారు. కరీంనగర్ ఎల్‌ఎండీలోకి 360.87 టీఎంసీలు, ఇల్లంతకుంట మండలంలోని ప్యాకేజీ–10 అన్నపూర్ణలోకి 88.04 టీఎంసీలు విడుదల చేశారు. ప్యాకేజీ–10 నుంచి సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌లకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు 17.31 టీఎంసీలు వదిలారు. మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీకి ఏకంగా 360.87 టీఎంసీల మేర నీరు వదలడం విశేషం.
ఏడేళ్లలో 527 టీఎంసీల ఇన్‌ఫ్లో
అత్యధికంగా 175 టీఎంసీలు కాళేశ్వరం నుంచే..
465 టీఎంసీల ఔట్ ఫ్లో
ఎల్‌ఎండీకి 360 టీఎంసీలు తరలింపు
2017–18లో మొదలైన నీటి నిల్వ
ఏడేళ్లుగా మిడ్‌మానేరులోకి ఇన్‌ఫ్లో (టీఎంసీలలో..)
సంవత్సరం కాళేశ్వరం ఎస్సారెస్పీ వరద
2017–18 – 5.89 –
2018–19 – 11.19 1.31
2019–20 65.19 2.54 3.24
2020–21 37.84 20.58 21.26
2022–23 30.77 27.00 41.61
2023–24 6.37 15.63 27.63
2024–25 23.82(ఎస్‌వైపీ) 31.23 16.45
2025 సెప్టెంబర్ 6.77(ఎస్‌వైపీ) 31.47 17.52
మొత్తం 206.56 153.90 167.09
మిడ్‌మానేరు నుంచి ఔట్ ఫ్లో(టీఎంసీలలో..)
సంవత్సరం ఎల్‌ఎండీ ప్యాకేజీ–10 కుడి,ఎడమ కాలువ
2017–18 0.50 – 0.17
2018–19 9.88 – 0.23
2019–20 48.20 5.89 1.25
2020–21 64.70 11.87 1.79
2021–22 62.42 17.17 2.05
2022–23 70.60 7.52 2.95
2023–24 49.23 4.73 4.92
2024–25 41.10 20.77 3.95
2025 సెప్టెంబర్ 14.24 20.09 0.0
మొత్తం 360.87 88.04 17.31
మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి 2017–18 నుంచి 2025 సెప్టెంబర్ 14వ తేదీ వరకు 527 టీఎంసీల మేర నీరు కాళేశ్వరం, ఎస్‌వైపీ, ఎస్సారెస్పీ, వరద ఆధారంగా ఇన్‌ఫ్లోగా వచ్చింది. మిడ్‌మానేరు నుంచి 465 టీఎంసీల మేర నీరు ఔట్‌ఫ్లోగా తరలింది. ఔట్‌ఫ్లోలో అధిక భాగం అంటే 360.87 టీఎంసీల నీరు ఎల్‌ఎండీకి తరలింది.
– జగన్, ఈఈ, మిడ్‌మానేరు