
ఆయిల్ పాం తోటల్లో ‘ఆఫ్రికన్’ పురుగులు
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల జిల్లాలో మూడేళ్ల క్రితం ఆయిల్ పాం సాగుకు రైతులు ముందుకొచ్చారు. ప్రస్తుతం ఆ తోటలు కాపుకొస్తున్నాయి. ఆయిల్ పాం సాగుపై రైతులకు పెదగా అవగాహన లేకపోవడంతో ఉద్యానశాఖ, కంపెనీ అధికారులు సమావేశాలు నిర్వహిస్తూ.. క్షేత్రస్థాయిలో పర్యటించి వివరించారు. రైతులు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించి తోటలు సాగు చేస్తున్నారు. అయితే పూతను పిందెగా మార్చి.. దిగుబడి పెంచేందుకు మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి, ధర్మపురి మండలాల్లో సాగవుతున్న ఆయిల్ పాం తోటల్లో పరాగ సంపర్కం కోసం ఉద్యానశాఖ, లోహియా ఆయిల్ పాం కంపెనీ అధికారులు ఆఫ్రికన్ పురుగులను వదిలుతున్నారు.
పూతకొస్తున్న తోటలు
జిల్లాలో 2022–23లో సుమారు మూడు వేల ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేశారు. ఆ తోటలు పూతకు వస్తున్నాయి. పూత పిందెగా మారి, ఆపై కాయగా మారాల్సి ఉంటుంది. అప్పుడే ఆయిల్ పాం గెలలను కోసి ప్రాసెసింగ్‌కు పంపించాల్సి ఉంటుంది. తోటల్లో రసాయన ఎరువులు.. పురుగు మందుల వాడకం పెరగడంతో పరాగ సంపర్కం కోసం సహజ సిద్ధంగా వచ్చే పురుగులు రావడం లేదు. దీంతో పూత దశలో ఉన్న తోటల్లో ఆఫ్రికన్ పురుగులను వదులుతున్నారు. ఎలాడోబియస్ కామెరునికాస్ అనే ఆఫ్రికన్ పురుగు ఆయిల్ పాం తోటల్లో పరపరాగ సంపర్కం జరపడంలో కీలకపాత్ర పోషిస్తుంది. చెట్టు పూతకు వస్తే.. ఆ గెలకు ఆడ, మగపుష్పాలు పూస్తాయి. ఆఫ్రికన్ పురుగులు మగ పుష్పాల పరాగ రేణువులను ఆడ పుష్పాలకు చేరవేస్తాయి. తద్వారా ఫలదీకరణం జరిగి కాయలు ఏర్పడతాయి. పరాగ సంపర్కం జరగడం ద్వారా ప్రతి చెట్టుకూ పిందెలు ఎక్కువగా తయారై, దిగుబడి బాగా పెరుగుతుంది.
ఆఫ్రికన్ పురుగుల ప్రాధాన్యత ఏంటంటే..?
ఆఫ్రికన్ పురుగులు 4 మిల్లీమీటర్ల పొడవుంటాయి. నల్లటి రంగులో ఉండి పరాగ సంపర్కం కలిగిస్తాయి. తొలుత ఈ పురుగులను 1980 ప్రాంతంలో మలేసియాలో ఆయిల్ పాం దిగుబడి పెంచేందుకు దిగుమతి చేసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ కూడా ఆయిల్ పాం సాగు పెరగడంతో దిగుబడి కోసం ఆఫ్రికన్ పురుగులను తీసుకొస్తున్నారు. చెట్టుకు ఉండే మగ పుష్పాల సువాసనకు ఆఫ్రికన్ పురుగులు ఆకర్షించబడతాయి. పురుగులు వాలినప్పుడు పుప్పోడి రేణువులు వాటి శరీరానికి అంటుకుంటాయి. తర్వాత పురుగులు ఆడ పుష్పాలపై వాలినప్పుడు వాటి శరీరానికి అంటుకున్న పుప్పోడి రేణువులు పడి పరాగ సంపర్కం జరుగుతుంది. ఈ పురుగుల ద్వారా అనుకున్న స్థాయిలో పరాగ సంపర్కం జరిగితే ఆయిల్ పాం తోటల్లో గెలలు ఎక్కువగా ఏర్పడటంతోపాటు నూనె దిగుబడి పెరుగుతుంది. ఈ పురుగులు ఆయిల్ పాం తోటలకుగానీ.. మనుషులకు గాని హానికరమైనవి కావు.
ఉద్యానశాఖ ద్వారా తోటల్లోకి..
దిగుబడి పెంచాలనేది లక్ష్యం

ఆయిల్ పాం తోటల్లో ‘ఆఫ్రికన్’ పురుగులు