
వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మృతదేహం
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం మోతె శివారు నవదుర్గ ఆలయ సమీపంలో ఓ వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. సుమారు 35 నుంచి 40 ఏళ్ల వ్యక్తిగా అనుమనిస్తున్నామని, కుడిచేతిపై ఎస్.హన్మంతరావు అని రాసి ఉందని, గోధుమరంగు నిండుచొక్కా, నెవీబ్లూ కలర్ ప్యాంట్ ఉందని, గుర్తించిన వారు రూరల్ ఎస్సై సదాకర్‌ను సంప్రదించాలని కోరారు.
కట్నం వేధింపులు.. భర్తకు జైలు
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్‌కు చెందిన కూర నిర్మలను కులంపేరుతో దూషించడంతోపాటు కట్నం కోసం వేధించడంతో భర్త అంజిరెడ్డికి మంగళవారం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించినట్లు కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. నగునూరుకు చెందిన నిర్మలను వివాహం చేసుకున్న అంజిరెడ్డి రూ.5లక్షల కట్నం తీసుకురావాలని వేధించడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ చేసిన కోర్టు అంజిరెడ్డికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ.1000 జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు.
● వివరాలు వెల్లడించిన ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి
వేములవాడ: భూమి కోసమే సిరిగిరి రమేశ్ హత్యకు గురైనట్లు ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి అన్నారు. మంగళవారం వివరాలు వెల్లడించారు. చందుర్తిలోని భూమిని ఎస్సీ కార్పొరేషన్ లోన్‌పై పెట్రోల్ బంక్ కోసం చిర్రం రవి, సిరిగిరి రమేశ్‌కు రిజిస్ట్రేషన్ చేశారని, అయితే పెట్రోల్ బంక్ ఇవ్వకుండా, తిరిగి భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా సదరు భూమి తనదేనంటూ రమేశ్ అమ్మకానికి ప్రయత్నాలు మొదలు పెట్టడంతో విషయం తెలుసుకున్న రవి ఆ భూమి తనకు దక్కాలంటే రమేశ్‌ను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు ఎద్దండి వెంకటేశ్, అలా వంశీకి సుపారీ ఇచ్చాడు. పథకం ప్రకారం ఈనెల 19న రాత్రి 8 గంటలకు పెద్దూరు సబ్‌స్టేషన్ సమీపంలో కారు ఆపి, కారులో నిద్రిస్తున్న రమేశ్‌ను వంశీ, చిర్రం రవి కదలకుండా గట్టిగా పట్టుకోగా, వెంకటేశ్ కత్తితో రమేశ్ గొంతు, ఛాతిపై పొడిచి హత్య చేశాడు. అనంతరం కారుతోపాటు మృతదేహాన్ని వేములవాడ నందికమాన్ సమీపంలోని రమేశ్‌కు చెందిన నందీశ్వర టౌన్‌షిప్ వెంచర్‌లో వదిలి పారిపోయారు. ఈక్రమంలో వేములవాడ శివారులోని సాయిరక్షా దాబా సమీపంలో ఎద్దండి వెంకటేశ్, అలా వంశీని పట్టుకుని, వారి నుంచి కారు, మొబైల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తిని సీజ్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ వివరించారు. చిర్రం రవి పరారీలో ఉన్నాడని తెలిపారు.
మహిళలపై బండరాళ్లు విసిరిన వ్యక్తిపై కేసు
కొత్తపల్లి: చింతకుంట శాంతినగర్‌లో ఈనెల 21న బతుకమ్మ ఆడుతున్న మహిళలపై బండరాళ్లతో దాడిచేసిన వ్యక్తిని రిమాండ్ చేశామని సీఐ కోటేశ్వర్ తెలిపారు. ప్రైమరీస్కూల్ ప్రాంతానికి చెందిన షేక్‌సజ్జు బండరాళ్లతో అక్కడే బతుకమ్మ ఆడుతున్న కాసారపు లక్ష్మి, మధు రెడ్డి, ఎల్లమ్మ, మొగిలి అకిరానంద్‌పై దాడిచేయగా గాయాలయ్యాయి. కాసారపు లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, షేక్‌సజ్జును మంగళవారం అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
● రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గితే
● 14.945 కిలోల గంజాయి దహనం
సిరిసిల్లక్రైం: రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా వివిధ పోలీసుస్టేషన్‌లలో నమోదైన 45 కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 14.945 కిలోల గంజాయిని చట్ట ప్రకారం జి ల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలు పా టిస్తూ దహనం చేసినట్లు ఎస్పీ మహేశ్ బీ గితే తెలిపారు. మనకొండూరులోని బయోలాజికల్ ల్యాబ్‌లో గంజాయిని దహనం చేసినట్లు వివరించారు. గంజాయి రవాణా చేసినా, అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి రవాణాపై నిరంతరం నిఘా పెడుతూ నార్కోటిక్ జాగిలాలతో విస్తృత తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, డీసీఆర్బీ సీఐ నాగేశ్వరరావు, ఆర్‌ఎస్సై రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మృతదేహం