
22 నుంచి దేవీ నవరాత్రోత్సవాలు
● 30న మహాసరస్వతీ పూజ ● అక్టోబర్ 1న తెప్పోత్సవం
వేములవాడ: రాజన్న ఆలయంలో ఏటా జరిగే శ్రీదేవీ నవరాత్రోత్సవాలు ఈ ఏడాది 22 నుంచి అక్టోబర్ 2 వరకు వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో రమాదేవి బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని, భక్తులకు దర్శనం, వసతి, రవాణా సౌకర్యాలు సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉత్సవాల ప్రత్యేకత
ఈ ఉత్సవాలు రాజన్న ఆలయంలో అత్యంత ప్రాధాన్యం కలిగినవి. నిత్యం విభిన్నమైన వాహనసేవలు భక్తులను ఆధ్యాత్మిక భక్తి ప్రవాహంలో ముంచెత్తుతాయి. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఈ వేడుకల్లో హాజరయ్యేందుకు వేములవాడకు తరలివస్తారు. ఈనెల 29న ఉదయం 9.30 గంటలకు నక్షత్ర పుస్తకరూపిణి మహాసరస్వతీ పూజ, 30న రాత్రి 8 గంటలకు మహిషాసుర మర్ధని అమ్మవారికి మహాపూజ, అక్టోబర్ 1న రాత్రి 8.15 గంటలకు పూర్ణాహుతి, బలిహరణం, స్వామి వారి ధర్మగుండంలో తెప్పోత్సవం, 2న విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ, అంబారీసేవ, శమీపూజలు నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి వివరించారు.