
భూ సమస్యలపై ఫోకస్
గ్రామాలకు జీపీవోల రాకతో పెరిగిన రెవెన్యూశాఖ బలం
భూ సమస్యలపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 83,520 దరఖాస్తులు
ఇప్పటి వరకు పరిష్కారమైంది 11 శాతమే
త్వరలోనే రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులకు మోక్షం
జిల్లా దరఖాస్తులు పరిష్కారమైనవి
కరీంనగర్ 31,325 3,182
జగిత్యాల 25,675 1,600
రాజన్న సిరిసిల్ల 8,928 2,706
పెద్దపల్లి 17,592 2,217
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూసమస్యల పరిష్కారంపై రెవెన్యూ అధికారులు దృష్టిసారించారు. భూభారతి చట్టం అమల్లోకి రావడం, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వడం, గ్రామానికో గ్రామపంచాయతీ అధికారి(జీపీఓ)ను కేటాయించడంతో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. సర్వే నంబర్లు, భూయజమాని ఇంటి పేరు, యజమాని పేర్లలో తప్పులు దొర్లడం, విస్తీర్ణం తక్కువగా నమోదవడం, నిషేధిత భూముల జాబితాలో పట్టా భూమి సర్వే నంబర్లు రావడం, సర్వే నంబర్లు మిస్ కావడం, సాదాబైనామా, మ్యుటేషన్, ఆసైన్డ్ భూముల పట్టా, వారసత్వ పట్టా వంటివి దాదాపు 20 కేటగిరీలకు సంబంధించిన సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భూసమస్యలపై 83,520 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 9,705 దరఖాస్తులు మాత్రమే పరిష్కారమయ్యాయి. ఇంకా 89శాతం దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదు.
సాదాబైనామా దరఖాస్తులే ఎక్కువ
ఉమ్మడి జిల్లా పరిధిలో మే నెలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో కరీంనగర్ జిల్లాలో 31,325 దరఖాస్తులు వస్తే 3,182 పరిష్కారమయ్యాయి. జగిత్యాల జిల్లాలో 25,675 దరఖాస్తులు వస్తే 1,600 పరిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8,929 దరఖాస్తులకు 2,706, పెద్దపల్లి జిల్లాలో 17,592 దరఖాస్తుల్లో 2,217 పరిష్కారమయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో 40శాతం మేర సాదాబైనామావే ఉన్నాయి. గతంలో తెల్లకాగితాలపై భూములు కొనుగోలు చేసి కాస్తులో ఉన్నవారు 2020లో పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో ధరణి చట్టం ప్రకారం.. సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం వీలుకాదని గతంలో హైకోర్టు స్టే విధించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. భూభారతి చట్టంలో సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి వెసులుబాటు కల్పించినట్లు కోర్టుకు ప్రభుత్వం నివేదించడంతో స్టే ఎత్తేసింది. దీంతో సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశముంది.