
ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండాలి
కరీంనగర్‌కల్చరల్: సైగ భాష అందరూ నేర్చుకోవాలని, యూనివర్సల్‌గా ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. నగరంలోని విద్యానగర్‌లో ఉన్న ప్రభుత్వ బధిరుల ఆ శ్రమ పాఠశాలలో గురువారం నిర్వహించిన ముందస్తు అంతర్జాతీయ సైన్ లాంగ్వేజ్ దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. భాషలు లేనికాలంలో సైగల ద్వారానే కమ్యూనికేషన్ ఉండేదన్నారు. ప్రపంచమంతా ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండడం ద్వారా దివ్యాంగులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దివ్యాంగుల భావాలను అర్థం చేసుకొని, వారితో మెరుగైన కమ్యూనికేషన్ ఉండాలనే ఉద్దేశంతో జిల్లాలో అక్షయ్ ఆకృతి ఫౌండేషన్ ద్వారా అధికారులకు, ఉత్సాహం ఉన్నవారికి సైన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తమ సర్వీసులో ఒకసారైనా అంధుల, బధి రుల పాఠశాలల్లో విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్‌ఐఈపీఐడీ బాధ్యులు డాక్టర్ హిమాన్షు, ప్రియాంక, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, జీసీడీవో కృపారాణి, తహసీల్దార్ నరేందర్, బధిరుల పాఠశాల ప్రిన్సిపాల్ కమల పాల్గొన్నారు.
పని ప్రదేశాల్లో ఫిర్యాదు కమిటీలుండాలి
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నివారణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జెడ్పీ సమావేశ మందిరంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ సభ్యులకు వర్క్‌షాప్ నిర్వహించారు. పది మంది కన్నా ఎక్కువ కార్మికులు లేదా ఉద్యోగులు ఉన్న సంస్థల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు పూర్తి చేయాలన్నారు. కమిటీ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్లు ప్రదర్శించాలని ఆదేశించారు. లైంగిక వేధింపులకు గురైన బాధితురాలు తమ సంస్థ లేదా ఐసీసీలో ఫిర్యాదు చేయాలని, వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వెంకటేశ్, మెప్మా పీడీ స్వరూపారాణి, సీడీపీవో సబిత, లీడ్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు పాల్గొన్నారు.