
కూలిన నాలా.. తప్పిన ప్రమాదం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని కశ్మీర్‌గడ్డలో నాలా కూలింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఆ సమయంలో జనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో నాలాపై ఉన్న పైకప్పు దెబ్బతింది. బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో ఒక్కసారిగా ఆర్‌బీ స్వీట్‌హౌస్, అపూర్వ కళాశాల మధ్యన నాలా పై ఉన్న పైకప్పు కూలిపోయింది. నగరంలోని ప్రధాన నాలాల్లో ముఖ్యమైన ఈ నాలా, రాంనగర్ నుంచి మంకమ్మతోట, జ్యోతినగర్, ముకరాంపుర, అంబేడ్కర్ స్టేడియం, గణేశ్‌నగర్, లక్ష్మినగర్‌ల మీదుగా వాగులో కలుస్తుంది. ముకరాంపురలోని టూటౌన్ పోలిసుస్టేషన్ పక్కనుంచి వెళ్తున్న ఈ నాలా శిథిలావస్థలో ఉండి, ఈ ప్రాంతంలో వరద సమస్యకు కారణమవుతోంది. శిథిలావస్థకు చేరిన ఈ నాలాను పునర్నిర్మించాలని ముకరాంపుర,కాశ్మీర్‌గడ్డ, మంకమ్మతోట తదితర ప్రాంతవాసులు ఏళ్లకాలంగా విన్నవిస్తున్నా, ఫలితం కనిపించడం లేదు. తాజాగా ఈ నాలా కూలిపోవడంతో, మరోసారి నాలా పునర్నిర్మాణం తెరపైకి వచ్చింది. స్థానిక మాజీ కార్పొరేటర్ శ్రీదేవి చంద్రమౌళి ఘటనాస్థలికి వచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.