
పోషణ మాసోత్సవాలు విజయవంతం చేయాలి
కరీంనగర్: జిల్లాలో ఈనెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు నిర్వహించే పోషణ మాసోత్సవాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నెలరోజుల పాటు జిల్లాలో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ పోషకాహారం ప్రాధాన్యతను వివరించాలన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు తీసుకోవాల్సిన ఆహారం, పోషణ పర్యవేక్షణపై గ్రామస్థాయిలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల బరువు, ఎత్తు తూచడం, తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి పోషకాహారం ప్రాధాన్యత వివరించడం, మగవారికి వంటల పోటీలు, కిశోర బాలికలకు వైద్య పరీక్షలు వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విద్య, వైద్య, పంచాయతీరాజ్, మెప్మా, తదితర శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పోషణ మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రేపు ప్రజాపాలన దినోత్సవం
కరీంనగర్ అర్బన్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మున్సిపల్, మండల, గ్రామస్థాయిలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కేంద్రంలో జరిగే వేడుకల్లో రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొననున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు జాతీయ జెండాకు వందనం చేయనున్నారు.
డీఈవోగా బాధ్యతలు తీసుకున్న మొండయ్య
కరీంనగర్: జిల్లా విద్యాశాఖ అధికారిగా శ్రీరాం మొండయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీఈవోగా కొనసాగిన చైతన్యజైనీ నెలరోజుల పాటు సెలవులో వెళ్లడంతో డైట్ ప్రిన్సిపల్ శ్రీరాం మొండయ్యను డీఈవోగా బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు.
జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ పత్తి రూ. 7,300 పలికింది. క్రయ విక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
గన్నేరువరం(మానకొండూర్): మండలంలోని ఖాసీంపేట శ్రీమానసాదేవి ఆలయంలో సోమవారం సినీనటి శ్రీలక్ష్మి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మిని సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, ప్రధాన అర్చకుడు పెండ్యాల అమర్‌నాథ్‌శర్మ, బద్దం మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, రమణారెడ్డి, శివారెడ్డి, సింగిరెడ్డి రాజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సాయిని మల్లేశం, భక్తులు పాల్గొన్నారు.

పోషణ మాసోత్సవాలు విజయవంతం చేయాలి

పోషణ మాసోత్సవాలు విజయవంతం చేయాలి