
కమ్యూనిస్టుల త్యాగాలతోనే హైదరాబాద్ విలీనం
● సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు వెంకట్‌రెడ్డి
చిగురుమామిడి(హుస్నాబాద్): కమ్యూనిస్టు పార్టీ నేతల ప్రాణ త్యాగాలతోనే హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనం అయ్యిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధపోరాట వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని ఇందుర్తి, ఒగులాపూర్, గాగిరెడ్డిపల్లి, చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి గ్రామాల్లో అమరుల స్మారక స్తూపాల వద్ద నివాళి అర్పించి పార్టీ జెండా ఎగురవేశారు. గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూమి కోసం, దాస్యశృంఖలాల విముక్తి కోసం పుట్టిందే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమన్నారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, గూడెం లక్ష్మి, బత్తుల బాబు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.