
సాగు భిన్నం.. ఆదాయం ఘనం
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల వ్యవసాయాధారిత జిల్లా. ఇక్కడి రైతులు ఆదాయం రాని పంటలను ఎప్పటికప్పుడు తొలగించి ఆదాయం సమకూర్చే పంటలు సాగు చేస్తుంటారు. ఇప్పటివరకు మామిడి పెట్టింది పేరుగా ఉన్న జిల్లా రైతులు.. కొత్త పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. నాలుగైదేళ్లుగా మామిడిలో సరైన దిగుబడి రాకపోవడంతో మూడేళ్లలోనే ఆదాయం వచ్చే.. కాగితం తయారీకి ఉపయోగించే నీలగిరి, సుబాబుల్, సరుగుడు మొక్కలను పెంచుతున్నారు. కొందరు రైతులు ఏక పంటగా సాగు చేస్తుండగా.. మరికొందరు అంతరపంటగా పామాయిల్ సాగు చేస్తున్నారు.
● రైతులను ప్రోత్సహించాలని..
జిల్లాకు సమీపంలోనే సిర్పూర్‌కాగజ్‌నగర్‌లో పేపర్ మిల్లు ఉంది. ఆ మిల్లు నుంచి రోజుకు 400 టన్నుల పేపర్ బయటకు వస్తుంది. దీనికి రోజుకు వెయ్యి టన్నులు (దాదాపు 60 నుంచి 70 లారీలు) కర్ర అవసరం. పొరుగు రాష్ట్రాల నుండి 50లారీల వరకు కర్ర వస్తే.. రాష్ట్రం నుంచి కేవలం 10 నుంచి 15 లారీల కర్ర మాత్రమే వస్తోంది. పేపర్ మిల్లు రవాణా భారాన్ని తగ్గించుకోవడంతోపాటు గ్రామాల్లోనూ పేపర్ తయారీకి ఉపయోగించే కర్రను సాగు చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసం రైతులకు భారీగా సబ్సిడీలు ఇస్తూ ప్రోత్సహిస్తోంది. ఒక్కో మొక్క ఖరీదు రూ.11 ఉంటే రైతులకు సరుగుడు మొక్కను రూ.4, నీలగిరి రూ.4.50, సుబాబుల్ రూ.మూడు చొప్పున అందిస్తున్నారు.
● కంపెనీతో ఒప్పందాలు చేసుకుంటున్న రైతులు
నీలగిరి, సుబాబుల్, సరుగుడు మొక్కలను పెంచే రైతులు సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని పేపర్ మిల్లుతో రేటు ఒప్పందం చేసుకుంటున్నారు. ప్రస్తుతం టన్నుకు రూ.5వేలు (కంపెనీ కటింగ్ చేస్తే), రూ.7 వేలు(కటింగ్ చేసుకుని తీసుకెళ్తే) చెల్లిస్తున్నారు. మొక్క నాటిన మూడేళ్ల తర్వాత చెట్లను కట్ చేస్తామని, ఆ సమయంలో ధర ఎంతుంటే అంత చెల్లిస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. కంపెనీ రేటు నచ్చకపోతే ఇతరులకు అమ్ముకోవచ్చని చెబుతున్నారు. మూడేళ్ల పాటు సర్వీస్ ఇచ్చినందుకు.. సబ్సిడీపై మొక్కలు సరఫరా చేసినందుకు కొంత సర్వీస్ చార్జీ వసూలు చేస్తారు.
● జిల్లాలో వెయ్యి ఎకరాల్లో సాగు
జిల్లాలో ఎక్కువగా సరుగుడు మొక్కలను సాగు చేస్తున్నారు. మేడిపల్లి మండలం కట్లకుంట, తొంబరావుపేట, పోరుమల్ల, సారంగాపూర్, బీర్‌పూర్, మల్లాపూర్ వంటి గోదావరి తీర ప్రాంత రైతులు ఎక్కువగా ముందుకొస్తున్నారు. ఒక్కోచెట్టు 20 నుంచి 30 ఫీట్లు పెరగడమే కాకుండా.. ఎకరాకు 50 నుంచి 60 టన్నుల కర్ర వస్తుంది. ఈ లెక్కన ఎకరాకు రూ.2.50 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సరుగుడు చెట్లను మూడేళ్ల తర్వాత కటింగ్ చేసుకుని ఇతర పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంది. నీలగిరి, సుబాబుల్ ఒక్కసారి నాటితే 3 నుంచి 4 సార్లు కటింగ్ వస్తుంది. వీటికి ఎలాంటి ఎరువులూ వేయాల్సిన అవసరం లేదు. పైగా నీరు పెద్దగా అవసరం ఉండదు.
జగిత్యాల జిల్లాలో నీలగిరి, సరుగుడు, సుబాబుల్ సాగు
జిల్లాలో వెయ్యి ఎకరాల్లో ..
పేపర్ మిల్లుతో ఒప్పందాలు

సాగు భిన్నం.. ఆదాయం ఘనం