
కోతిని తప్పించబోయి..
● అదుపు తప్పిన ద్విచక్రవాహనం
● అక్కడికక్కడే ఐకేపీ సీసీ దుర్మరణం
పెగడపల్లి: కోతి అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి కిందపడి ఐకేపీ ఉద్యోగి మృతి చెందిన సంఘటన పెగడపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. పెగడపల్లి ఐకేపీ (సెర్ప్)లో మండలంలోని నామాపూర్‌కు చెందిన కొత్తూరి రవికుమార్(53) సీసీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో విధుల్లో భాగంగా నందగిరి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా కోతి అడ్డు రావడంతో బైక్ అదుపు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. రవికుమార్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు.
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన గుండేటి మల్లేశం (43) గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాలు.. మల్లేశం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇంటి వద్ద ఉన్న పాడిపశువు కోసం పచ్చిగడ్డి కోసేందుకు గ్రామ శివారులోని బత్తుల రాజమల్లయ్య పొలం వద్దకు వెళ్లాడు. పొలం గెట్లపై గడ్డి కోస్తుండగా, సమీపంలోని వ్యవసాయ బావి వద్ద పచ్చిగడ్డి ఎక్కువగా కనిపించడంతో మల్లేశం బావి ఒడ్డున గడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో మృతిచెందాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రామగుండం: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈనెల 6న గోదావరిఖని వంతెనపై విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు రామగుండం అక్బర్‌నగర్‌కు చెందిన నారకట్ల రాజేశ్(25) నదిలో పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులు బృందాలుగా డ్రోన్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా, యువకుడి మృతదేహాన్ని బుధవారం రాత్రి చెన్నూర్ సమీపంలోని సోమనపల్లి గోదావరినది ఒడ్డున పోలీసులు గుర్తించారు. మృతదేహం కుళ్లి పోయి ఉండడంతో కొన్ని ఆనవాళ్ల ఆధారంగా గుర్తించారు. గురువారం కుటుంబసభ్యులు దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఈ సమయంలో మృతుడి తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ‘కొడుకా నీవు మాకు చెప్పకుండానే గంగమ్మ ఒడికి చేరినవా.. మేమిద్దరం ఎవరి కోసం బతకాలిరా’ అంటూ గుండెలు బాధుకుంటూ రోదించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు గోదావరిఖని టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.