
విద్యాకేంద్రంగా మంథని
● ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారం ● మంత్రి శ్రీధర్‌బాబు
మంథని: ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మంథనిని విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేలా ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. మంథని మున్సిపాలిటీలో రూ.80 లక్షలతో నిర్మించనున్న నూతన ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రానికి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీపీఎస్ బాలికల పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ (మంచు లక్ష్మి ఫౌండేషన్) ఆధ్వర్యంలో డిజిటల్ తరగతులు ప్రారంభించారు. అలాగే మంత్రి క్యాంపు కార్యాలయంలో 205 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. పార్చూన్ రామ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 80 మంది పేద విద్యార్థులకు రూ.15 వేల విలువ చేసే పుస్తకాలు, ఇతర వస్తువులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలకు నాణ్యమైన విద్య అందాలని టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలు అందిస్తున్న మంచు లక్ష్మి, ఇతర ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో 6 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పదేళ్లు ప్రజలను పట్టించుకోని బీఆర్‌ఎస్ నాయకులు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతికి ఆస్కారం లేదని, లంచం ఇస్తే వారి ఇళ్లు రద్దు చేసి, తీసుకున్న వారిపై చర్యలుంటాయని పేర్కొన్నారు. పాఠశాలల్లో పిల్లలకు మొరుగైనన బోధన అందించేందుకు సహకరిస్తున్న సంస్థకు కలెక్టర్ కోయ శ్రీహర్శ అభినందనలు తెలిపారు.
ప్రేవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే తమవంతు సాయం అందిస్తున్నట్లు టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఫౌండర్ ప్రముఖ నటి మంచు లక్ష్మి పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 51 తరగతి గదుల్లో డిజిటల్ సౌకర్యాలు కల్పించామన్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో గ్రంథాలయ చైర్మన్ అన్నయ్యగౌడ్, డీఈవో మాధవి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న, ఆర్డీవో సురేశ్ తదితరులు ఉన్నారు.