
ఒగ్గు కళాకారుడి మృతి
హుజూరాబాద్‌రూరల్: మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారుడు చెవుల రాజు(40) గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం ఉదయం ఇంటి వద్ద రాజుకు ఒకసారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు 108అంబులెన్స్‌లో హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాజు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. గత 15 ఏళ్లుగా రాజు ఒగ్గు కథలకు ప్రాణం పోశాడని, ఆయన కళా ప్రదర్శనలతో ఈ ప్రాంతంలో గొప్ప గుర్తింపు పొందారని పలువురు పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలం గోధూర్‌కు చెందిన బూరం దేవదాస్ (50) ఎలకల మందు తాగి చికిత్సపొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. దేవదాస్ రెండు నెలల క్రితం గల్ఫ్ నుంచి వచ్చాడు. తిరిగి వెళ్తానని ఇంట్లో చెప్పగా.. పిల్లలకు పెళ్లికాలేదని, వారి పెళ్లి అయ్యాక వెళ్లాలని భార్య రాజమణి వారించింది. ఇద్దరి మధ్య వివాదం జరిగింది. మనస్తాపానికి గురైన దేవదాస్ ఈనెల 9న ఎలుకల నివారణ మందు తాగాడు. కుటుంబసభ్యులు చికిత్సనిమిత్తం మెట్‌పల్లికి.. అక్కడి నుంచి నిజామాబాద్ తరలించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. మృతుడి భార్య రాజమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు.
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన వంగ స్వరూప(47) ఆత్మహత్యకు యత్నించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపిన వివరాలు.. వంగ మల్లయ్య–స్వరూప దంపతులకు ఇద్దరు కూతుర్లు, కొడుకు సంతానం కాగా అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. కూతుర్ల పెళ్లికి అప్పులు అయ్యాయి. ఆరునెలల క్రితం మల్లయ్య తాటిచెట్టు పై నుంచి ప్రమాదవశాస్తు కింద పడగా గాయాలు కావడంతో పని చేసే స్థితిలో లేడు. దీంతో స్వరూప అప్పులు ఎలా తీర్చాలని మానసికంగా కృంగిపోయేది. ఈ క్రమంలో ఈ నెల 8న పురుగులమందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొంతుదూ గురువారం మృతిచెందింది. మృతురాలి కూతురు రమ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మంచంపైనుంచి పడి వ్యక్తి..
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్ సమీపంలో ఓ దుకాణం వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ఎండీ.సాహెబ్ హుస్సేన్ (69) ఈనెల 7న మంచంపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన సాహెబ్ హుస్సేన్ వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. మంచంపై నుంచి కిందపడగా తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే షాపు యజమాని జగిత్యాల ఆస్పత్రిలో చేర్పించాడు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. హుస్సేన్ కుమారుడు మొయినోద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు.