
ఉపాధి కూలీలకు కేవైసీ
● యాప్‌లో ముఖ గుర్తింపు ప్రక్రియ ● పైలట్ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక
కరీంనగర్‌రూరల్: ఉపాధిహామీ పథకం కూలీలు ఈకేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కూలీలు తమ ఆధార్‌కార్డులను జాబ్‌కార్డులతో కేవైసీ చేసుకుంటేనే అక్టోబరు 1నుంచి ఉపాధి పనులు కల్పించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కరీంనగర్, హన్మకొండ జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. సోమవారం నుంచి గ్రామాల్లో కూలీల కేవైసీ ప్రక్రియను ఉపాధిహామీ అధికారులు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 2,59,795 ఉపాధిహామీ జాబ్‌కార్డులుండగా పనిచేసే కూలీలు 1,25,710 మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ నమోదు ప్రక్రియ కోసం ఎన్‌ఆర్‌ఈజీఏస్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్‌ను ప్రవేశపెట్టింది. ఉపాధికూలీ ఆధార్, ఉపాధికార్డు వివరాలను నమోదు చేసి కూలీ ముఖగుర్తింపు ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో కూలీలు తమ ఆధార్, జాబ్‌కార్డులతో ఉపాధిహామీ సిబ్బందిని కలిస్తే ఈకేవైసీ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆధార్‌కార్డును కూలీలు తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకుని ఉండాలి. ఈకేవైసీ ప్రక్రియ చేయించుకోని కూలీలకు పనికల్పించడం ఇకనుంచి వీలుకాదు. కూలీలకు ఈకేవైసీ విధానంపై అధికారులు అవగాహన కల్పిస్తూ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. కొత్త విధానంతో పనుల్లో పారదర్శకత పెరుగుతుందని, ఒక జాబ్‌కార్డుపై మరొకరు పనిచేసే అవకాశం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.
కేవైసీ తప్పనిసరి
ఉపాధిహామీ కూలీలు తప్పనిసరిగా ఈకేవైసీ నమోదు చేసుకోవాలి. జిల్లావ్యాప్తంగా నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. పది రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి.
– శ్రీధర్, డీఆర్‌డీవో, కరీంనగర్