
యూరియా కొరతకు కేంద్రమే కారణం
సైదాపూర్: రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. యూరియా తయారీ, రాష్ట్రాలకు పంపిణీ చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతే అన్నారు. గురువారం జిల్లాలోని సైదాపూర్ మండలంలో పర్యటించారు. నల్లరామయ్యపల్లి, ఎగ్లాస్‌పూర్‌లో గ్రామ పంచాయతీ భవనం, ఆకునూర్, వెంకటేశ్వర్లపల్లి, బూడిదపల్లిలో ఓపెన్‌జిమ్‌లను ప్రారంభించారు. ఆకునూర్ కేజీబీవీ పాఠశాలలో డార్మెంటరీ హాల్, డ్రైనేజీ, బూడిదపల్లిలో అంగన్‌వాడీ కేంద్రానికి భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. నల్లరామయ్యపల్లి, ఆకునూర్, బూడిదపల్లిలో మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకు సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రాష్ట్రాని చెందిన బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉండికూడా తెలంగాణకు యూరియా కొరత లేకుండా చూడడం లేదన్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. యూరియా కొరత నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది లంచం ఇవ్వందే ఏ పని చేయడంలేదని, ఆర్‌ఐ సతీశ్ డబ్బులు ఇవ్వకుంటే ఏ పని చేయడం లేదని బొమ్మకల్ కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రికి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్వినీ తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, ఏఎంసీ చైర్మన్ దొంత సుధాకర్, సింగిల్ విండో చైర్మన్ తిరుపతిరెడ్డి, ఆర్డీవో రమేశ్, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.