
ఆగని అమృత్ భారత్
ఈ రోడ్ నుంచి జోగ్భనీ రైలుకు ఉమ్మడి జిల్లాలో దక్కని స్టాప్
నేపాల్ సరిహద్దు వరకు వెళ్తున్న రైలు
పాత కరీంనగర్‌లో వేలాదిగా ఉత్తరాది వలస కూలీలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: దేశంలోని వలస కూలీలను మాతృభూమికి చేర్చేందుకు ప్రవేశపెట్టిన రైలు అమత్ భారత్ ఎక్స్‌ప్రెస్. దేశంలో నలుమూలలా పనిచేస్తున్న కూలీలను తక్కువ ఖర్చుతో స్వస్థలాకు చేరుస్తుంది. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా నడిపించే ఈరోడ్– జోగ్భనీ 16601/02 అమృత్ భారత్ రైలుకు స్థానికంగా ఎక్కడా స్టాప్ దక్కలేదు. ముందున్న వరంగల్, పొరుగున ఉన్న మంచిర్యాలలో ఈ రైలుకు హాల్టింగ్ ఇవ్వడం గమనార్హం. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయం పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌లోని పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉత్తరాధి కూలీలను తీవ్రంగా నిరాశపరిచింది.
త్వరలో సేవలు ప్రారంభం
ప్రస్తుతం బిహార్‌లో ఎన్నికల దష్ట్యా ఆ రాష్ట్రానికి రైల్వేశాఖ ఇప్పటి వరకు ఆరు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్‌రైళ్లను ప్రవేశ పెట్టింది. అందులో అతి త్వరలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా బిహార్‌లోని జోగ్భనీ నుంచి తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ వరకు 16601/02 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. మన రాష్ట్రం మీదుగా ప్రవేశ పెట్టబోయే తొలి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఇదే. ఇటీవల వెలువడిన రైలు షెడ్యూల్‌లో ఉమ్మడి జిల్లాలోని ఏ ఒక్క రైల్వేస్టేషన్‌లో స్టాప్ లేకపోవడం స్థానిక, వలస కార్మికులను ఎంతో నిరాశ పరిచింది.
హాల్టింగ్ ఇవ్వాలి
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు వరంగల్ నుంచి బల్లార్షా మధ్య కేవలం మంచిర్యాల రైల్వేస్టేషన్‌లోనే హాల్టింగ్ ఇచ్చారు. జోగ్భని నుంచి నేపాల్ సరిహద్దు కేవలం 10 కిలోమీటర్ల దూరమే. ఈ రైలుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, పెద్దపల్లి జంక్షన్, రామగుండం రైల్వే స్టేషన్‌లో స్టాప్ కల్పించాలని ఇక్కడి ప్రయాణికులు కోరుతున్నారు. నాలుగు నెలల్లో పెద్దపల్లి జంక్షన్ మీదుగా ప్రారంభించిన మూడు రైళ్లకు స్టాప్ కల్పించలేదు.
– ఫణి, నార్త్ తెలంగాణ రైల్వే ఫోరం