
రిలీవింగ్ ఆర్డర్ కోసం నిరీక్షణ
కరీంనగర్ అర్బన్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా ఉంది జీపీవోల పరిస్థితి. ఈ నెల 5న గ్రామ పాలన అధికారు(జీపీవో)లను ని యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నియామకపత్రాలిచ్చిన విషయం విదితమే. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉండాల్సిన జీపీవోలు మునుపటిశాఖలు(మునిసిపల్, మిషన్ భగీరథ) రిలీవింగ్ అర్డర్ ఇవ్వకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తవగా పోస్టింగ్ ఇచ్చారు. రిలీవింగ్ అర్డర్ అందకపోవడంతో నాలుగు రోజులైనా విధుల్లో చేరలేదు.
ఇతర నియోజకవర్గాల్లో నియామకం
జిల్లాలో 187మంది జీపీవోలను నియమించారు. 210 రెవెన్యూ గ్రామాలుండగా 255 క్లస్టర్లు అవసరమని అధికారులు నివేదించారు. ఈ నెల 8న కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ కౌన్సెలింగ్ నిర్వహించగా నిబంధనల క్రమంలో పోస్టింగ్ కల్పించారు. దివ్యాంగులు, వితంతువులు, స్పౌజ్ కేసులకు మొదటి ప్రాధాన్యతనివ్వగా తదుపరి ర్యాంకు వారీగా ఆప్షన్లు తీసుకోగా సొంత మండలం, నియోజకవర్గం కాకుండా ఇతర నియోజకవర్గంలో పోస్టింగ్ కల్పించారు. 145 వాస్తవ క్లస్టర్లు కాగా 255 క్లస్టర్లు రికై ్వర్‌మెంట్‌గా చూపారు.
అయిదేళ్ల నిరీక్షణకు తెర
2020 సెప్టెంబర్‌లో వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థ రద్దుతో సదరు ఉద్యోగులను జిల్లాలో సర్దుబాటు చేయగా మిగిలిన వారికి ఇతర జిల్లాల్లో పోస్టింగ్ కల్పించారు. 18మంది సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబానికి దూరమై భూపాలపల్లి, హన్మకొండ, కామారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉన్నతాధికారులకు, మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా సొంత జిల్లాకు రావడం అందని ద్రాక్షగా మారింది. ఈ క్రమంలో జీపీవోల నియామకం వారిలో సంతోషాన్ని నింపింది. రిలీవింగ్ అర్డర్ త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జిల్లాలో మొత్తం గ్రామాలు: 318
రెవెన్యూ డివిజన్లు: 02(కరీంనగర్, హుజురాబాద్)
రెవెన్యూ క్లస్టర్లు: 255,
రెవెన్యూ గ్రామాలు: 210, జీపీవోలు: 187