
వెనకబడిన విద్యార్థులపై దృష్టి పెట్టండి
కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్: ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకోవడంతో పాటు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కొత్తపల్లి శివారులోని ఓ ఫంక్షన్ హాలులో తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు చదువుతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, నైతిక విలువలు బోధించాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు బానిస కాకుండా గమనించాలని సూచించారు. ప్రభుత్వం తరఫున ప్రైవేటు పాఠశాలల టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (ఎస్‌హెచ్‌వీఆర్)లో పాల్గొనాలని సూచించారు. డీఈవో చైతన్య జైనీ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులకు ప్రశంశాపత్రాలు అందించి సత్కరించారు.
ఓల్డ్ హైస్కూల్ భవనాన్ని సైన్స్ మ్యూజియంగా మార్చాలి
నగరంలోని ఓల్డ్ హైస్కూల్ భవనాన్ని సైన్స్ మ్యూజియంగా ఆధునీకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. పురాతన ఉన్నత పాఠశాల భవనంలో కొనసాగుతున్న సైన్స్ మ్యూజియాన్ని శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఈవో చైతన్య జైనీతో కలిసి సందర్శించారు. పురాతన పాఠశాల తరగతులను నూతన భవనంలోకి మార్చాలన్నారు. అక్కడే కొనసాగుతున్న డీసీబీ కార్యాలయాన్ని మరోచోటకు, ఓపెన్ స్కూల్ కేంద్రాన్ని సీతారాంపూర్‌లోని ఎంపీపీఎస్ పాఠశాల సమీప భవనంలోకి తరలించాలన్నారు. పురాతన పాఠశాల భవనాన్ని పూర్తిగా సైన్స్ మ్యూజియానికే కేటాయించాలన్నారు. సైన్స్ మ్యూజియంలో రోబోటిక్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్, ఆర్ట్, క్రాప్ట్ కంప్యూటర్ ల్యాబ్ కోసం ప్రత్యేక గదులు, విద్యార్థుల కోసం సెమినార్ హాల్ ఏర్పాటు చేయాలన్నారు. సమగ్ర శిక్ష జిల్లా కోఆర్డినేటర్ అశోక్, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ పాల్గొన్నారు.