
సేవా ‘కుసుమా’లు
సిరిసిల్లకల్చరల్: సిరిసిల్ల చరిత్రలో పదోతరగతిలో రాష్ట్రస్థాయి ర్యాంకులతో ఉత్తీర్ణులైన తొలి తరం విద్యార్థులు వాళ్లు. కటిక పేదరికంలో పుట్టి కష్టపడి ప్రయోజకులయ్యారు. మల్లేశం సివిల్ ఇంజనీర్‌గా ఏఈ హోదాలో ఉద్యోగ విరమణ పొందారు. తన తొలి ప్రయత్నంలోనే మెడిసిన్‌లో సీటు సంపాదించిన ప్రతిభాశాలి విఠల్. శ్రీహరి పరిశోధక రంగంలో స్థిరడ్డారు. పేద విద్యార్థులకు సాయం చేయాలి.. వాళ్ల పురోగతిలో భాగస్తులం కావాలి.. సాధ్యమైన సౌజన్యాన్ని పంచాలనుకొని సమాజ సేవలో తరిస్తున్నారు. పట్టణంలో సాధారణ నేత కార్మికులైన కుసుమ రామయ్య–శాంతవ్వ దంపతులకు మల్లేశం, విఠల్, శ్రీహరితోపాటు ముగ్గురు కూతుళ్లున్నారు. పాఠశాల విద్య పూర్తి చేసేందుకు కూడా సహకరించని ఆర్థిక పరిస్థితుల మధ్య నానా ఇబ్బందులు పడుతూ చదువుకున్నారు. పసితనం నుంచే చురుగ్గా ఉండే మల్లేశం, విఠల్, శ్రీహరి తల్లిదండ్రులకు సహాయపడుతూనే చదువుపై ఆసక్తి పెంచుకున్నారు. ఫలితంగా శివనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతిలో ప్రతిభావంతుడిగా మల్లేశం, పక్కనే జెడ్పీ హైస్కూల్ నుంచి ఎస్సెస్సీలో స్టేట్ ఐదో ర్యాంకుతో విఠల్ ఉత్తీర్ణుడయ్యాడు. గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్ కోర్సులు, పెళ్లి తరువాత అమెరికాలో గ్యాస్ట్రో ఎంటరాలజీలో సూపర్ స్పెషలైజేషన్ చేసి అక్కడే స్థిరపడ్డారు.
పండుగకు వచ్చి.. చలించి..
పండుగకు సిరిసిల్లకు వచ్చిన విఠల్.. చదువుకున్న బడికి వెళ్లారు. వర్షాకాలం కావడంతో పైకప్పు నుంచి ఉరుస్తున్న దృశ్యానికి చలించిపోయారు. పాఠశాల పురోగతి కోసం రూ.15లక్షల విరాళం ప్రకటించాడు. తన తండ్రి పేరుతో కుసుమ రామయ్య జెడ్పీ హైస్కూల్‌గా స్థిరపడింది. కంప్యూటర్ విద్య కోసం రూ.5లక్షలు, జెండా వందనాలు, పిల్లల పండుగలు, ఫర్నీచర్‌కు ప్రతి ఏటా కొంత నిధిని సమకూరుస్తున్నారు. యూఎస్‌ఏలో ప్లాస్టిక్ సర్జన్‌గా పని చేస్తున్న కొడుకు శశిధర్‌తో ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించి 100కు పైగా శస్త్ర చికిత్సలు చేయించారు. గాంధీ మెడికల్ కళాశాలకు రూ.15లక్షలు విరాళం, హైదరాబాద్‌లో ఉన్న పద్మశాలీ, ఉమెన్స్ హాస్టళ్లకు ఆర్థిక చేయూత, అమెరికాలోని ఆలయాలు, ఆసుపత్రుల అభివృద్ధి కోసం దాదాపు రూ.30లక్షల వరకు వెచ్చించారు.
పెన్షన్ నిధితో ప్రతిభా పురస్కారాలు
పుట్టి పెరిగిన ప్రాంతంపై అభిమానంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలనుకున్నారు కుసుమ మల్లేశం. సివిల్ ఇంజనీర్‌గా ఏఈ హోదాలో ఉద్యోగ విరమణ చేసిన ఆయన తనకు వచ్చిన పెన్షన్ డబ్బుల్లోంచి కొంత మొత్తాన్ని ప్రభుత్వ పాఠశాలల పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారు. తద్వారా వచ్చే వడ్డీ డబ్బులతో ప్రతి ఏటా ప్రతిభావంతులకు నగదు పురస్కారాలు అందజేసేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు అగ్రహారంలోని ఎస్‌ఆర్‌ఆర్ పాలిటెక్నిక్ కళాశాల, శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కుసుమ రామయ్య జెడ్పీ హైస్కూల్, గీతానగర్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానాచార్యులకు డిపాజిట్ చేసిన పత్రాలను అందజేశారు. యూనియన్ బ్యాంకు, కేడీసీసీ బ్యాంకుల్లో రూ.1.5లక్షల చొప్పున డిపాజిట్ చేసిన పత్రాలను ఇటీవలే ఆయా విద్యాసంస్థల ప్రధాన నిర్వాహకులకు అందజేశారు.
ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రోత్సాహం
సర్కార్ బడుల బాగు కోసం
ఆర్థిక చేయూత

సేవా ‘కుసుమా’లు

సేవా ‘కుసుమా’లు

సేవా ‘కుసుమా’లు